- పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు
- హార్ట్ ప్రాబ్లమ్, షుగర్ ఉన్న ఇద్దరిని వదిలేసిన్రు
- కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
- పహారా మధ్య కొనసాగుతున్న చిన్నోనిపిల్లి రిజర్వాయర్ పనులు
గద్వాల, వెలుగు : చిన్నోనిపల్లి రిజర్వాయర్ వ్యతిరేకిస్తూ నిర్వాసితులు చేస్తున్న దీక్షను శనివారం భగ్నం చేసిన పోలీసులు సుమారు 20 మందిని అదుపులోకి తీసుకోగా, వారు ఎక్కడున్నారో ఎవరికీ చెప్పడం లేదు. మరోవైపు పహారా మధ్య రిజర్వాయర్ పనులు కొనసాగిస్తున్నారు. నిర్వాసిత కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదట వారిని గట్టు పీఎస్‌కు తరలించారు. తర్వాత గట్టు తహసీల్దార్ ముందు బైండోవర్చేశారు. అనంతరం శాంతినగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి రైతులను ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లామని చెబుతున్నా అక్కడ వారు లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిర్వాసితుల్లో ఇద్దరు షుగర్, హార్ట్ పేషెంట్లు ఉండడంతో సోమవారం మధ్యాహ్నం వారిని విడిచి పెట్టారు. మిగతా18 మంది ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. మంగళవారం ఆర్డీవో రాములు పనులను పర్యవేక్షించగా డీఎస్పీ రంగస్వామి బందోబస్తు పర్యవేక్షించారు.
కలెక్టరేట్ ను ముట్టడించిన రైతులు
కొందరు నిర్వాసిత రైతులు సోమవారం సాయంత్రం పొద్దుపోయాక కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ గతంలో తమకు పరిహారం చాలా తక్కువగా ఇచ్చారని, కొన్నేండ్లుగా పొలాలను చేసుకుంటున్నామని సడన్‌గా పొలాలు, ఇండ్లను వదిలి వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు ఊరు ఖాళీ చేయడానికి ఏడాది గడువు కావాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు మూడు విడతల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరున్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొంతమంది నిర్వాసిత రైతులను కలెక్టర్వల్లూరి క్రాంతి దగ్గరకు తీసుకువెళ్లారు. దీంతో ఆయన నిర్వాసిత రైతులు చిన్నోనిపల్లి నుంచి మూడు నెలల్లో ఖాళీ చేయాలని చెప్పారు. ఎక్కువ పరిహారం ఇచ్చే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బయటకు వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నోనిపల్లి రిజర్వాయర్ సమస్య ఇప్పటిది కాదని, గత పాలకులు కమిషన్ల కోసం కక్కుర్తి పడి పనులను ఆపేయించారన్నారు. 90 శాతం పూర్తయిన పనులను ఇప్పుడు తాము ఇప్పుడు తాము కంప్లీట్చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయం చేస్తామన్నారు.
చీలికలు తెచ్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం
నిర్వాసితుల్లో చీలికలు తీసుకొచ్చి లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ప్లాన్చేసిందని, అందులో భాగంగానే వారికి అనుకూలంగా ఉన్న నిర్వాసిత రైతులను ఎమ్మెల్యే కలెక్టర్దగ్గరకు తీసుకుపోయారని పలువురు నిర్వాసిత రైతులు ఆరోపించారు. అనుకూలంగా లేని వారిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి, అనుకూలంగా ఉన్నవారితో ఇదంతా చేయిస్తున్నారన్నారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన కొందరు రైతులు మీడియాతో మాట్లాడుతుండగా ఎవరూ అనవసరంగా మాట్లాడొద్దని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడ్డుకున్నారన్నారు.