- 17 ఏళ్ల తర్వాత చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు
- ఖాళీచేసి ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్లాంటున్న ఆఫీసర్లు
- కనీస సౌలతులు లేని చోటుకు ఎట్లా పోవాలంటున్న నిర్వాసితులు
గద్వాల, వెలుగు: 17 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించి మధ్యలో సప్పుడు చేయకుండా ఇప్పుడు హడావిడిగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మిస్తే తమ పరిస్థతి ఏమిటని ప్రభుత్వాన్ని నిర్వాసితులు నిలదీస్తున్నారు. తమకు కేటాయించిన స్థలాలలో సౌలతులు కల్పించకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో వసతులు లేకుండా తాము ఇండ్లు ఎలా కట్టుకోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
17 ఏళ్ల తర్వాతనెట్టెంపాడు లిఫ్టులో భాగంగా గట్టు మండలంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను నిర్మించేందుకు 2005 సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చారు. 2006 సంవత్సరంలో మండలంలోని చిన్నోనిపల్లి, బోయిలగూడెం, ఇందువాసి, లింగాపురం, చాగదోన గ్రామాలలోని 2,006 ఎకరాలను సేకరించారు. చిన్నోనిపల్లి విలేజ్ లో 201 ఇండ్లు ముంపునకు గురవుతున్నాయని గుర్తించి పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత రిజర్వాయర్ పనులు ఆగిపోయాయి. గ్రామస్తులు ఊరిని ఖాళీ చేయకుండ అక్కడే ఉంటున్నారు. అయితే 17 ఏళ్ల నుంచి ఏమనకుండా ఇప్పుడు రిజర్వాయర్ అంటూ హడావిడి చేస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. వచ్చిన పరిహారం డబ్బులన్నీ ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు.
కూలిన డ్రైనేజీలు..
ముంపునకు గురవుతున్న చిన్నోనిపల్లి విలేజ్ వారికి దగ్గర్లోనే భూసేకరణ చేసి వసతి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ వాటర్ ట్యాంకు కూలిపోయే దశకు చేరుకున్నది. డ్రైనేజీలు కూలిపోయి మట్టితో నిండిపోయాయి. ప్లాట్లకు వేసిన మట్టి రోడ్లు గుంతల మయంగా మారిపోయాయి. కరెంటు పోల్స్ ఒరిగిపోయాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామనుకున్నా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు నీరు ఇవ్వడానికి ఇప్పుడు తమను బలిపశులను చేస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. వాస్తవానికిచిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఆయకట్టు కూడా లేదని నిర్వాసితులు గుర్తు చేస్తున్నారు.
సమీక్షలతోనే సరి
నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గత ఆరు నెలల్లో పలుమార్లు సమీక్షించి ఆఫీసర్లను ఆదేశించారు. కానీఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గుడిసెలు వేసుకోవడానికి కూడా పైసలు లేవు
రిజర్వాయర్ పనులు ఇక స్టార్ట్ కావని తాము వచ్చిన పరిహార డబ్బులను అప్పులకు కట్టుకున్నామని నిర్వాసితులు అంటున్నారు. ఇప్పుడు గుడిసెలు వేసుకోవడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. అకస్మాత్తుగా ఆర్డీఎస్ కు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను ముంగట వేసుకున్నారని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది
నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పైసలు లేవు, ప్లాట్లలో సౌలతులు లేవు మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రిజర్వాయర్ రద్దుచేసి మా ఇండ్లను మాకు ఇవ్వాలి.
- వెంకటేష్ నిర్వాసితుడు చిన్నోనిపల్లి
సౌలతులు కల్పిస్తున్నాం
చిన్నోనిపల్లి నిర్వాసితులకు ఏర్పాటు చేసిన ప్లాట్ లలో అన్ని సౌలతులు కల్పిస్తున్నాం. మట్టి కొట్టి ప్లాట్లను లెవెల్ చేస్తున్నాం. కరెంటు, రోడ్లు, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం.
- రాములు, ఆర్డీవో గద్వాల