తిరుపతిని ఏపీ రాజధాని చేయాలి : చింతా మోహన్..!

తిరుపతిని ఏపీ రాజధాని చేయాలి : చింతా మోహన్..!

2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ తిరుపతిని ఏపీ రాజధాని చేయాలంటూ కొత్త నినాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.70 ఏళ్ల క్రితం మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు తిరుపతిని రాజధాని చేయాలని ఎన్జీ రంగా ప్రతిపాదించారని, కానీ అప్పట్లో కర్నూలు రాజధానిగా చేశారు రాయలసీమకు మొదటి నుంచి నీటి కష్టాలే అని అన్నారు. రాయలసీమలో మిగిలింది రాళ్లు, కొండలే సీమ బిడ్డలు నిరుద్యోగంతో సతమతమవుతున్నారని అన్నారు. బీటెక్ చేసి బ్రాందీ షాపులో పనిచేస్తున్నారని.వీటన్నింటికీ పరిష్కారం దొరకాలంటే తిరుపతిని రాజధాని చేయడమే ఏకైక పరిష్కారమని అన్నారు. 

అన్ని ప్రాంతాల వారికి తిరుపతి ఆమోదయోగ్యమని, లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, సోమశిల నీరు, ఏడు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరామని అన్నారు. 

ఏపీలో జగన్ గాలి తగ్గిందని, చంద్రబాబుకు అనుకూలంగా పేదల్లో వాతావరణం లేదని అన్నారు చింతా మోహన్.బీజేపీతో కలిసి చంద్రబాబు తన అవకాశాలను పాడు చేసుకున్నారని,ఏపీ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ఉంటే ఒకరికి టికెట్ ఇస్తే, ఏపీకి వెళ్లేసరికి మరొకరికి మారుతుంది కాబట్టి నేను పోటీ చేస్తానా లేదా అనేది చెప్పలేనని అన్నారు. అసలే జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్న క్రమంలో చింతా మోహన్ లేవనెత్తిన ఏపీ రాజధానిగా తిరుపతి నినాదం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.