
సదాశివపేట, వెలుగు : ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ సంగారెడ్డి అభ్యర్థి చింత ప్రభాకర్ కోరారు. శుక్రవారం సదాశివపేట మండల పరిధిలోని నిజాంపూర్, కొల్కూర్, పొట్టిపల్లి, ఏటిగడ్డసంగం, మాలపాడ్,బొబ్బిలిగాం, ఆత్మాకూర్, ఎల్లారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు తెలుసని, ఐదేళ్లుగా పదవిలో లేకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావు సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని, బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే ప్రజలు బాగుంటారన్నారు. నియోజకవర్గ ప్రజల ముఖం చూడని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికలు రాగానే ఊళ్ల మీద పడ్డారని ఆరోపించారు. మోస పూరిత హామీలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తూ మళ్లీ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. జగ్గారెడ్డి ప్రజలకు ఏం చేశారో నిలదీసి అడగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్చెప్పే బూటకపు మాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా నని, ప్రజల సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.