మహిళా సాధికారత అంటే..
సాధికారత అంటే విభిన్న అంశాల కలబోత వ్యక్తి తనకున్న శక్తియుక్తులకు సమగ్రంగా ఆవిష్కరించుకొని, తనకు, తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడటం. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత లేదా సామూహిక జీవనానికి సంబంధించిన విషయాలలో స్వయం నిర్ణయాన్ని తీసుకునే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, స్వేచ్ఛను కలిగి ఉండటం .అదేవిధంగా మహిళ తన జీవితంపై స్వేచ్ఛను, అధికారాన్ని కలిగి ఉండాలి.
విద్య, ఉద్యోగం సాంకేతిక పరిశోధన వైద్యం, కళ, సాహిత్యం, క్రీడ , రాజకీయాలు, వ్యాపార అధికారం మొదలగు అన్ని అంశాలలో వారి ఎదుగుదలకు, భాగస్వామ్యానికి అవసరమైన అన్ని అవకాశాలను వారికి కల్పించడం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కలిగి ఉండటం. ఆర్థిక స్వాతంత్రాన్ని, రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం. స్త్రీ పురుష సమానత్వ ఆవశ్యకతను తెలియజేయటమే సాధికారత. ఏ దేశంలో మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంబన కలిగి ఉంటారో అక్కడ మహిళ సాధికారతతోపాటు ఆ దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుంది.
భారత జ్వాలామణులు
ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మొదటి మహిళ. సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఇందిరా ప్రియదర్శిని గాంధీ- భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి. జస్టిస్ ఫాతిమా బీబీ భారతదేశపు మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా పాటిల్ భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము15వ రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవి చేపట్టిన మొదటి గిరిజన మహిళ. సుష్మా స్వరాజ్ మొదటి మహిళా విదేశాంగ శాఖ మంత్రి.
నిర్మలా సీతారామన్ భారతదేశం తొలి రక్షణ శాఖ మంత్రి. ప్రస్తుతం ఆర్థిక మంత్రి. కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి. కల్పనా చావ్లా ఒక ఇండో అమెరికన్ వ్యోమగామి. దీప కరుణాకర్ జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి భారత అథ్లెట్‌గా తన పేరు చరిత్రలో లిఖించుకుంది. ఇలా దేశం గర్వించదగ్గ స్థాయిలో భారతీయ మహిళలు రాజకీయ, సామాజిక రంగాలలో అత్యున్నత శిఖరాలకు ఎదిగినవారున్నారు, అయినా దేశంలో ఇప్పటికీ మహిళా సాధికారిత సంపూర్ణం కాలేదు.
మహిళాభివృద్ధికి కృషిచేయాలి
స్త్రీని పురుషునితో సమానంగా గుర్తించి గౌరవించాలి. వారి పట్ల జరుగుతున్న అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులను నివారించి దోషులకు వెంటనే కఠిన శిక్షను అమలు చేయాలి. మహిళ విద్య, ఉద్యోగాభివృద్ధికి కృషి చేయాలి. మహిళలకు వారి రక్షణ పట్ల, గృహ హింస, నిర్భయ, పోక్సో, దిశ వంటి చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. మహిళా సాధికారత అనేది కేవలం చట్టాలతో మాత్రమే వచ్చేది కాదు. దానికోసం అందరూ చిత్తశుద్ధితో కృషిచేసినప్పుడే ఇది సాధ్యపడుతుంది.
స్త్రీ శక్తి స్వరూపిణి. సృష్టికి కర్త. ఒక తల్లి నుంచి మొదలుకొని అన్ని పాత్రలను పోషించగలిగే సహనమూర్తి స్త్రీ. ఇంటి నుంచి మొదలుకొని సమాజాన్ని, దేశాన్ని , ప్రపంచాన్ని నడిపించగల ధీర వనిత స్త్రీ. ఓర్పు, విధేయత, వినయం, జాలి, ప్రేమ, కరుణ కలిగిన కల్మషంలేని రూపం స్త్రీ.
- చింతకాయల ఝాన్సీ,ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి