- రాజులు బూజులు - చదువుల సారం పుసకావిష్కరణ
కరీంనగర్, వెలుగు: టీచర్ కంటే గొప్పగా సమాజాన్ని వ్యాఖ్యానించేవాళ్లు వేరొకరు ఉండరని, టీచర్‌కు సమాజంతో అనుబంధం అలాంటిదని ఓయూ తెలుగు డిపార్ట్ మెంట్ హెడ్ ప్రొఫెసర్ చింతకింది కాశీం అన్నారు. కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో రిటైర్డ్ ఎంఈవో వీరగోని పెంటయ్య రాసిన 'రాజులు బూజులు -- చదువుల సారం' పుస్తకాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం కాశీం మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రచయితలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రచనలు చేశారని గుర్తు చేశారు. వీరగోని పెంటయ్య కూడా తాను పుట్టి పెరిగిన మంథని అగ్రహారంలోని బ్రాహ్మణ ఆధిపత్యం, వర్గపోరాటాల ప్రభావంతో రచనలు చేశారని తెలిపారు. బూర్ల వెంకటేశ్వర్లు పుస్తక సమీక్ష చేస్తూ పెంటయ్య రాసిన వ్యాసాల్లో ప్రస్తుత విద్యాసారాన్ని విడమరిచి చెప్పారన్నారు.
సభకు తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంజయ్య అధ్యక్షత వహించగా.. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, రచయితలు దేవేందర్, రాజేందర్, తిరుపతి, బసవేశ్వర, రాజేందర్, రాజమల్లు, తిరుపతి, సీవీ కుమార్, జీవన్ రాజు, రామ బ్రహ్మం పాల్గొన్నారు.