ANRAwards: వారికి రుణపడి ఉంటా.. ఏఎన్నార్‌ జాతీయ అవార్డు వేడుకపై చిరంజీవి, నాగార్జున ఎమోషనల్ పోస్ట్

ANRAwards: వారికి రుణపడి ఉంటా.. ఏఎన్నార్‌ జాతీయ అవార్డు వేడుకపై చిరంజీవి, నాగార్జున ఎమోషనల్ పోస్ట్

నట సామ్రాట్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతిని పురస్కరించుకొని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ‘ANR-100 కింగ్‌ ఆఫ్‌ ది సిల్వర్‌ స్క్రీన్‌' పేరుతో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం (2024 అక్టోబర్ 28న) గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సారి 2024కి గాను ANR జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బిగ్ బి అమితాబ్ చేతుమీదుగా అందుకున్నారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ANR జాతీయ అవార్డు అందుకోవడం పట్ల ట్విట్టర్ X ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.  "అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా వారి పేరు మీద ప్రతిష్టాత్మకమైన ‘ANR జాతీయ పురస్కారం’ నా గురువు అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా అందుకోవడం ఆశీర్వాదం మరియు సంతోషం. అక్కినేని కుటుంబంలోని ప్రతిఒక్కరికీ, అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సభ్యులకు, నా మిత్రుడు, సోదరుడు సుబ్బరామిరెడ్డికి, నాగార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినీ ప్రయాణానికి, నా ప్రతి మైలురాళ్లకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను." అని చిరు తన పోస్ట్ లో తెలిపారు. 

అలాగే నాగార్జున పోస్ట్ చేస్తూ ఈ వేడుకకు హాజరైనందుకు చిరంజీవి, అమితాబ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ రాకతో ఈ వేడుక మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మా నాన్న జీవితానికి సంబంధించిన విశేషాలతో కీరవాణి ప్రదర్శన కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ నాగార్జున కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ANR జాతీయ అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.