![చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయమేస్తుంది.. వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు దుమారం](https://static.v6velugu.com/uploads/2025/02/chiranjeevi-draws-internet-backlash-for-wanting-ram-charan-to-have-a-boy-so-their-legacy-can-continue_Kd7ikWoSq0.jpg)
- ఇంకో అమ్మాయిని కంటడేమోనని భయమేస్తున్నది
- చరణ్‌కు ఈసారైనా కొడుకు పుడితే బాగుండు.. వారసత్వం కొనసాగాలనేది నా కోరిక
- సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
- కొడుకే వారసుడా.. కూతురు కాదా? అంటూ విమర్శలు
హైదరాబాద్, వెలుగు: వారసత్వంపై సినీనటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన లెగసీ (వారసత్వం)ని కొనసాగించే మనుమడు కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకులు మాత్రమే వారసులా? కూతుర్లు కాదా? అంటూ ఆయనను పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు బుధవారం చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ కూతురు క్లీంకార సహా ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫొటోను ప్రదర్శించారు.
దీనిపై చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనుమరాళ్లతో ఉన్నట్టుగా ఉండదు.. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగాడు లేకుండా’ అని కామెంట్ చేశారు. ఆ సంభాషణను కొనసాగిస్తూ ‘‘చరణ్ ఈ సారికైనా సరే ఒక అబ్బాయిని కనరా.. మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక. ఈ అమ్మాయి (క్లీంకార) అంటే ముద్దు.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటారేమోనని భయం” అని అన్నారు. మగ పిల్లలతోనే తన లెగసీ కొనసాగుతుందని చిరంజీవిలాంటి అత్యున్నతస్థాయి వ్యక్తి కామెంట్ చేయడం సరికాదని, ఆడపిల్లలు వారసులా? కాదా? అంటూ దేశవ్యాప్తంగా పలువురు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్న, అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో కూడా కొడుకే వారసుడు అవ్వాలనే చిరంజీవి ఆలోచన సరికాదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికలుగా ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.