ఇది నేను ఎప్పుడూ ఊహించనిది.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంపై చిరు ఆనందం

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలోనే అత్యధిక పాటలకు డ్యాన్సులు వేసిన వ్యక్తిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్‎లో మెగాస్టార్‎ స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినందుకుగానూ మెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది. హైదరాబాద్‎లోని ఐటీసీ కోహినూర్‎లో ఇవాళ (సెప్టెంబర్ 22) అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్‎ఫెక్ట్ అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధులు మెగాస్టార్‎కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్‎ను అందజేశారు. 

ఈ అరుదైన గుర్తింపుపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్‎లో చోటు దక్కడం అనేది ఎప్పుడూ ఊహించని విషయమన్నారు. నేను ఎప్పుడూ ఊహించని గౌరవం ఇవాళ దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నటన కంటే ముందే నేను డ్యాన్స్‎కు శ్రీకారం చుట్టానని ఈ సందర్భంగా తెలిపారు చిరంజీవి. నటన కంటే డ్యాన్స్‎పై నాకున్న ఇష్టమే గిన్నిస్ రికార్డ్‎లో చోటు దక్కడానికి కారణం అనుకుంటానని అన్నారు. డ్యాన్స్ అనేది తనకు ఎక్స్‎ట్రా క్వాలిఫికేషన్ అని.. కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్‎లకు క్రేజ్ వచ్చిందన్నారు. డ్యాన్స్‎కు అవార్డ్ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. 

ALSO READ | అదీ లెక్కా: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్

ఈ ప్రతిష్టాత్మక వేడుకను తిలకించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత అల్లు అరవింద్, దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, బి గోపాల్, పలువురు మెగా హీరోస్ అటెండ్ అయ్యారు. కాగా, టాలీవుడ్‎తో పాటు భారత సినీ చరిత్రలో తన ఆట, పాట, యాక్షన్‎తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్‎కు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‎లో చోటు దక్కడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‎కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.