PawanKalyan: ఇంకా ఆస్పత్రిలోనే మార్క్ శంకర్ : కొడుకుని చూసి పవన్ కల్యాణ్ భావోద్వేగం

PawanKalyan: ఇంకా ఆస్పత్రిలోనే మార్క్ శంకర్ : కొడుకుని చూసి పవన్ కల్యాణ్ భావోద్వేగం

మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి సింగపూర్ కు చేరుకున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 8న) రాత్రి 11.30 గంటలకు శంషాబాద్‌ నుంచి సింగపూర్‌ వెళ్లారు పవన్‌. ఆయనతోపాటు చిరంజీవి దంపతులు కూడా వెళ్లారు.

సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. కొడుకుని చూసి పవన్ కల్యాణ్ భావోద్వేగం చెందారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై, మరో మూడు రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియచేసినట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ని ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకి తీసుకొచ్చామని పవన్ వెల్లడించారు. 

అసలేం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ (ఏప్రిల్ 8న) సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని చేతులు మరియు కాళ్ళపై కాలిన గాయాలు, పొగ పీల్చడం వల్ల సమస్యలు తలెత్తాయి.ప్రస్తుతం అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎప్పటికప్పుడు వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, వీరిలో 15మంది పిల్లలని సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. మంటలు వ్యాపించిన భవనంతోపాటు, పక్కనున్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించారు.

పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.." పొగ పీల్చిన తర్వాత మార్క్‌కు వైద్యులు బ్రోంకోస్కోపీ చేస్తున్నారని చెప్పారు. ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదని, అరకు పర్యటనలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని పవన్ చెప్పారు. తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారని, సింగపూర్‌లో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు.

స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంప్కు వెళ్లారని, సమ్మర్ క్యాంప్ స్కూల్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ అగ్ని ప్రమాదం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని పవన్ చెప్పారు. చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయని వివరించారు. మొదట ఈ విషయం విన్నప్పుడు అది ఒక సాధారణ సంఘటన అని తాను అనుకున్నానని అన్నారు.

"తరువాత, దాని తీవ్రత నాకు అర్థమైంది. ఒక పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు మరియు ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆసుపత్రిలో ఉన్నారు" అని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో అవసరమైన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారని, తనకు అండగా నిలిచిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.

ఇకపోతే, పవన్ కళ్యాణ్ కు రష్యన్ భార్య అన్నా లెజ్నెవాకు పోలేనా అంజనా పవనోవా మరియు మార్క్ శంకర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.