కైకాల సత్యనారాయణ భౌతికదేహానికి చిరంజీవి నివాళులు అర్పించారు. కైకాల మరణ వార్త విని హుటాహుటీన ఆయన నివాసానికి చేరుకున్న చిరంజీవి కైకాల పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల వందల సినిమాల్లో నటించిన గొప్ప నటుడు అని..ఆయన తనను తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచివారని చెప్పారు. అన్నయ్య ని కోల్పోయాంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో నటించిన ప్రతి సినిమా తనకు ఒక తీపి జ్ఞాపకమన్నారు. ఆయన మనస్సు చాలా మంచిదని... మంచి భోజన ప్రియుడని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగడసానుభూతి ప్రకటించారు. - ప్రభుత్వ లాంఛనాలతో ఘన నివాళి ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు అని చిరంజీవి చెప్పారు.
అంతకుముందు కైకాల మరణం పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ ట్విట్టర్ లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. కైకాల సత్యనారాయణ తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడు. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది.
https://twitter.com/KChiruTweets/status/1606137673785249792
డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను తమ్ముడూ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యనారాయణకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు అని అన్నప్పుడు..మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు. సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.