కేకే మరణవార్త విని గుండె ముక్కలైంది

కేకే మరణవార్త విని గుండె ముక్కలైంది

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ మరణవార్తపై ఎంతోమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లు తమ సినిమాల్లో కేకే పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. కేకే గొంతు వల్లే ఆ పాటలకు అంత క్రేజ్ వచ్చిందని వ్యాఖ్యానించారు. కేకే మరణవార్త విని ఎంతగా ఆవేదనకు లోనయ్యామనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. 

‘‘సింగర్ కృష్ణకుమార్ కున్నత్ ఆకస్మిక మృతి దిగ్భ్రాంతికరం. చాలా చిన్న వయసులోనే ఆయన కాలం చేయడం బాధాకరం. కేకే గొప్ప గాయకుడు, మంచి వ్యక్తి. ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయి దాయి దామా’ పాటను పాడిందాయనే. వారి కుటుంబ సభ్యులు, ఆప్తులకు నా హృదయపూర్వక సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ 

 - మెగాస్టార్ చిరంజీవి 

‘‘ కేకే అకాల మరణం బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో కేకే ఆలపించిన గీతాలు అభిమానులను,సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రంలోని ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువకావడానికి కేకే గాత్రం ఓ ప్రధాన కారణం.‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా’, ‘బాలు’ ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను ఆయన పాడారు. కేకే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి’’

- పవన్ కళ్యాణ్

 

‘‘కేకేలా మరెవరూ పాడలేరు. ఆయన గొంతు, పాట పాడే తీరు వెరీవెరీ స్పెషల్. ఆయన పాడిన పాటలన్నీ చిరస్థాయిగా నిలిచిపోయేంత గొప్పవి. కేకే.. మీరెప్పుడూ మా మనసుల్లోనే ఉంటారు. మీ పాటల రూపంలో కలకాలం నిలిచిపోతారు’’

- ఇమ్రాన్ హాష్మి

‘‘నా ‘ఉయురిన్ ఉయురె’ ఇక లేడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. కేకే ఇటీవల పాడిన ‘కోంజి కోంజి’ పాటను యావత్ ప్రపంచం కొనియాడుతున్న తరుణంలో.. ఆయన ఇక లేరనే వార్త వినాల్సి రావడం దిగ్భ్రాంతికరం. ఆ వార్తను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను. కేకే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం’’ (సూర్య హీరోగా 2002 లో విడుదలైన ‘ఖక్కా ఖక్కా’ సినిమాలో గాయకురాలు కె.ఎస్.చిత్రతో కలిసి ‘ఉయురిన్ ఉయురె’ సాంగ్ ను కేకే పాడారు)

- హారిస్ జయరాజ్, సంగీత దర్శకుడు

‘‘కేకే మరణ వార్తను విని నా గుండె ముక్కలైంది. ఆయన ఇక లేరని చెబుతున్న వార్తల వైపు తల తిప్పి కూడా చూడలేకపోతున్నాను.కేకే ఇక లేరనే వాస్తవాన్ని ఇంకా అంగీకరించలేకపోతున్నాను’’ 

- శ్రేయా ఘోషల్

‘‘బహు భాషా గాయకుడిగా కేకే మంచి పేరు తెచ్చుకున్నారు. చక్కటి పాటలతో ఆబాలగోపాలాన్ని అలరించారు. కేకే ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికరం’’ 

- కమల్ హాసన్

‘‘కేకే ఆకస్మిక మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. కేకే  గౌరవార్ధం ఆయన పార్థివ దేహానికి పోలీస్ గన్ సెల్యూట్  సమర్పిస్తాం’’

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి