- కిషన్ రెడ్డి నివాసంలో కీలక చర్చ?
- ఢిల్లీలో సంక్రాంతి ఉత్సవాల వెను వ్యూహం ఇదేనా..?
- సంక్రాంతికి అతిథిగా మోదీ..హాజరైన చిరంజీవి
- ఏపీలో పాగా కోసం కమలం ఎత్తులు
- రాజ్యసభకు జనసేన నుంచా? బీజేపీ నుంచా?
- అంగీకరించకుంటే రాష్ట్రపతి కోటాలో!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి పండుగకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఇదే ఉత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రీ ఎంట్రీపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలన్న అంశంపైనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ విషయం చర్చించేందుకు చిరంజీవిని ఢిల్లీకి పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆయన రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించనున్నారని కొందరంటే మరికొందరు మాత్రం జనసేన తరఫునే చిరు పెద్దల సభలో అడుగు పెడతారని అంటున్నారు. ఇంకా బీజేపీ తరపున ఆయన రాజ్యసభలో కూర్చొనే అవకాశం ఉందన్న టాక్ కూడా ఉంది.
అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. ఉత్తరాదిలో బాగానే రాణిస్తున్న కమలం పార్టీ దక్షిణాదిపై దృష్టి సారించింది. మెగా బ్రదర్స్ ద్వారా సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటోంది. ఏపీతో పాటు తెలంగాణలో పట్టున్న చిరంజీవికి చాన్స్ ఇవ్వడం ద్వారా రెండు రాష్ట్రాల్లో సత్తా చాటవచ్చిన భావిస్తున్నట్టు సమాచారం.
రీ ఎంట్రీకి ఒప్పుకొంటారా..?
ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి..ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడంతోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవిని ఇచ్చింది. ఆ తర్వాత చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన సమ్మతించకపోవచ్చని సన్నిహితులు చెబుతున్నారు. అన్నయ్యకు గౌరవం దక్కేందుకు పవన్ కల్యాణ్ చొరవ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కల్యాణ్.. చిరంజీవిని కన్వీన్స్ చేస్తున్నారని సమాచారం. పవర్ స్టార్ ప్లాన్ సక్సెస్ అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది.