చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. జనసేన,టీడీపీ,బీజేపీ కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని అన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేశ్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పంచకర్ల రమేశ్.. చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి.. సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ లను గెలిపించాలని కోరారు. తన చిరకాల మిత్రుడు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ తనకు కావాల్సిన ఇద్దరు ఒక ఎంపీగా, ఒకరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. ఇద్దర సమర్థవంతులు, మంచివారు.. నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతారు. ఆ విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉంది. పంచకర్ల రమేశ్ తన ఆశీస్సులతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి. అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలి. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు చిరంజీవి.
ఇటీవలే చిరంజీవి జనసేన పార్టీకి రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.