మార్చి 19న బ్రిటన్​ పార్లమెంట్​లో చిరంజీవికి సన్మానం

మార్చి 19న బ్రిటన్​ పార్లమెంట్​లో చిరంజీవికి సన్మానం
  • ‘లైఫ్​ టైమ్ అచీవ్​మెంట్ అవార్డు’ అందించనున్న బ్రిడ్జ్​ ఇండియా

లండన్: మెగాస్టార్  చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీరంగానికి, సమాజానికి నలభై ఏండ్లుగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా చిరంజీవిని సన్మానించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ఎంపీలు తెలిపారు. ఈ నెల 19న బ్రిటన్ పార్లమెంటు ‘హౌస్ ఆఫ్​కామన్స్’ లో ఈ సత్కార కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రోగ్రాంలో అధికార లేబర్ పార్టీకి చెందిన స్టాక్​పోర్ట్ ఎంపీ నవేంద్రు మిశ్రా, సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్​మెన్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.

అదే కార్యక్రమంలో మెగాస్టార్ కు ‘లైఫ్​ టైమ్​అచీవ్​మెంట్ అవార్డు’ ను అందించేందుకు బ్రిడ్జి ఇండియా సంస్థ పేర్కొంది. రాజకీయాలు, కల్చర్​పై చిరంజీవి బలమైన ప్రభావం చూపారని బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు తెలిపారు. సినిమా, ప్రజాసేవ, దాతృత్వం ద్వారా చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్​షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ఈ ‘లైఫ్​టైమ్​అచీవ్​మెంట్ అవార్డ్’ను అందజేస్తున్నట్లు వివరించారు.

బ్రిటన్​కు చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ పబ్లిక్ పాలసీలు రూపొందింస్తుంటుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు స‌‌మాజంపై చూపించిన ప్రభావాలను మరింతగా ప్రచారం చేయడం కోసం వారికి పురస్కారాలు అంజేస్తుంటుంది. బ్రిడ్జ్ ఇండియా  తొలిసారిగా ‘లైఫ్ టైమ్ ఆచీవ్‌‌మెంట్ అవార్డు’ అంద‌‌జేస్తుండగా.. తొలుత అందుకుంటున్నది చిరంజీవి కావడం విశేషం.