ఎన్నికలపై చిరంజీవి స్పందన..లెటర్ లీక్

 ఎన్నికలపై చిరంజీవి స్పందన..లెటర్ లీక్
  • ఎన్నికలు నిర్వహించమంటూ కృష్ణంరాజుకు లేఖ రాసిన చిరంజీవి 

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికలపై తెలుగు సినిమా నటుల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ..  వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి స్పందించి కృష్ణం రాజుకు రాసిన లేఖ లీక్ అయింది. ఇద్దరి మధ్య రెండు వర్గాలుగా జరిగే పోరు కాస్తా.. ఈసారి ఐదుగురు పోటీకి సై అంటున్న విషయం తెలిసిందే. తొలుత  ప్రకాష్ రాజ్ , మంచు విష్ణుల పోటీ ప్రకటనలతో మా ఎన్నికల వ్యవహారం బహిరంగం అయింది. ఆ తర్వాత జీవిత, హేమ మేము సైతం రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించగా.. ఒకింత ఆలస్యంగానైనా తెలంగాణ వాదంతో  సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖాముఖి పోటీ  కాస్తా.. బహుముఖం పోయి.. ఐదుగురి మధ్య పోటీకి దారితీసింది. 
ఐదుగురు అభ్యర్థుల మధ్య పోటీతో రసవత్తరంగా మారుతుందనుకుంటున్న తరుణంలో కొందరు నటుల మధ్య జరిగిన ఛాటింగ్.. ఆడియోలు తరచూ లీక్ అవుతుండడంతో ‘‘మా’’ ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ను బహిరంగంగా ప్రశ్నించిన వైనం కలకలం సృష్టించింది. వివాదం ముదిరే పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో చిరంజీవి స్పందించి రాసిన లేఖ లీక్ అయింది.

రెండు పేజీల ఈ లేఖలో వెంటనే ఎన్నికలు జరపాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన మెగాస్టార్‌ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజును కోరారు.ప్రస్తుత కమిటీ పదవీ కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని చిరంజీవి పేర్కొన్నారు. మీకు మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. సంస్థ ప్రతిష్ఠను మసకబారుస్తున్న వారెవ్వరిని మీరు ఉపేక్షించవద్దు. వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోండి’ అని చిరంజీవి సూచించినట్లు ఉన్న లేఖ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.