తీవ్ర మనోవేదనకు గురయ్యా.. ఏచూరి మరణంపై చిరు ఎమోషనల్ ట్వీట్

తీవ్ర మనోవేదనకు గురయ్యా.. ఏచూరి మరణంపై చిరు ఎమోషనల్ ట్వీట్

సీపీఎం పార్టీ అగ్రనేత, మాజీ రాజ్యసభ సభ్యుడు ఏచూరి సీతారాం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అనారోగ్యం కారణంగా ఆయన సెప్టెంబర్ 12వ తేదీన తుది శ్వాస విడిచారు. దేశంలోనే  బెస్ట్  పొలిటిషియన్స్‎లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఏచూరి మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏచూరి సీతారం మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన చిరు.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

‘‘ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఎం అగ్రనేత శ్రీ సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త తీవ్ర మనోవేదనకు గురిచేసింది. స్టూడెంట్ లీడర్‎గా ప్రస్థానం మొదలు పెట్టిన నాటి నుండి ఏచూరి ఎల్లప్పుడూ అణగారిన మరియు సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు, మొత్తం సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రజా సేవ, దేశం పట్ల అతని నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని మెగాస్టార్ ఏచూరి మరణం పట్ల సంతాపం తెలిపారు.

ALSO READ : ఏచూరి పోరాటాలు స్ఫూర్తి దాయకం

 ఇక, అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన ఏచూరి పార్థవ దేహాన్ని ఇవాళ ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు (సెప్టెంబర్ 14) ఉదయం నుండి సాయంత్రం వరకు సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఏచూరి పార్థివ దేహాన్ని ఆయన చివరి కోరిక మేరకు ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయనున్నారు.