వేవ్స్ అడ్వైజరీ బోర్డులో చిరంజీవి

వేవ్స్ అడ్వైజరీ బోర్డులో చిరంజీవి

హైదరాబాద్, వెలుగు: వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను తొలిసారిగా భారత్‎లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో మీడియా, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వేవ్స్‎పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.. ప్రతిష్టాత్మక ఈ స‌మ్మిట్‎ను ఈ ఏడాది చివ‌ర‌లో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు సినీ ప్రముఖులు, వ్యాపార‌వేత్తల‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రధాని వారితో మాట్లాడుతూ.. వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. స‌మావేశంలో అమితాబ్ బ‌చ్చన్‌, ర‌జనీకాంత్‌, చిరంజీవి,  నాగార్జున‌, అమీర్‌ఖాన్‌, స్టార్ హీరో అక్షయ్ కుమార్‌, అనుప‌మ్ ఖేర్‌, హేమ‌మాలిని, దీపిక ప‌దుకొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మ‌హీంద్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో త‌న‌ను భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధానికి ప్రత్యేకంగా కృత‌జ్ఞత‌లు తెలిపారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. త‌న‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వానికి ధ‌న్యవాదాలు తెలియ‌జేశారు.