చిరంజీవి నోట జై జనసేన.. మొత్తానికి ఓపెన్ అయ్యారు

చిరంజీవి నోట జై జనసేన.. మొత్తానికి ఓపెన్ అయ్యారు

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్లనున్నారని.. కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కనుందని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. చిరంజీవి మాత్రం ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు. ఆ మధ్య ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి కార్యక్రమానికి చిరంజీవి హాజరవ్వడంతో ఈ ఊహాగానాలకు బలం వచ్చింది. తాజాగా లైలా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.. అప్పటి ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అని.. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందని అన్నారు చిరంజీవి. దీనికి తోడు జై జనసేన అంటూ నినదించడం చిరంజీవి స్పీచ్ కి హైలైట్ గా నిలిచింది. 

ఎప్పుడూ లేనిది చిరంజీవి నోట ప్రత్యక్షంగా జనసేన ప్రస్తావన రావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరంజీవి వ్యాఖ్యల వెనక బీజేపీ పెద్దల వ్యూహం ఉందని.. ఇక చిరంజీవి పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వినిపిస్తున్న టాక్ నిజమేనేమో అన్న భావన రాక మానదు.. ఇదిలా ఉండగా అప్పటి ప్రజారాజ్యంలో ఉన్న నాయకులు కొందరు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉంటే.. మరికొంతమంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారందరిని జనసేన వైపు మళ్లించడమే చిరంజీవి వ్యాఖ్యల ఆంతర్యమని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ బలోపేతం దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జనసేన భవిష్యత్తు కోసం చిరంజీవి తన వంతు కృషి చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి.. కేవలం ఒక్క చోట గెలిచిన స్థాయి నుండి పోటీ చేసిన 21స్థానాల్లో గెలుపొంది వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన స్థాయికి ఎదిగిన జనసేన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపేందుకు మెగా బ్రదర్స్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా చూడాలి.