గత ఐదు సంవత్సరాలలో నకిరేకల్ నియోజకవర్గంలోతాను చేసిన అభివృద్ధి పనులే తనను మళ్ళీ గెలిపిస్తాయని నకరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే మళ్లీ చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే గా ఉండాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటే తప్పులేదు గానీ.. నకిరేకల్ అభివృద్ధి కోసం తాను పార్టీ మారితే తప్పని అనడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు.
2023, నవంబర్ 17వ తేదీ నకిరేకల్ లో వి6 మీడియాతో చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందాయన్నారు. 10 సంవత్సరాలు అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్టేషన్ లో ఉండి... మా నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గతంలో తనకు కోమటిరెడ్డి బ్రదర్స్ పదవులు ఇప్పించ్చారు ... ఆ పదవి పేరుతో పేదోడిని అని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంను గతంలో రౌడీ అని చెప్పిన కోమటిరెడ్డి బ్రదర్స్.. ఈరోజు గొప్పోడు అని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలో తీసుకొస్తాయని జోష్యం చెప్పారు.