నల్లగొండ మండలం చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి మృతి కలకలం రేపింది. డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి. డంపింగ్ యార్డ్ ప్రాంతంలో కొందరు చిరుత పులి కళేబరాన్ని బుధవారం గుర్తించారు.
గత కొన్ని నెలలుగా కేశరాజుపల్లి, శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు సైతం దీనిని గుర్తించారు. కాగా, చిరుత మృతి వార్త తెలుసుకున్న అటవీ, పోలీస్ శాఖ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు అధికారులు.