
కరీంనగర్: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయిన ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ చెందిన చింతల రాజయ్య(రాజు) అక్షర చిట్ ఫండ్లో ఏజెంట్గా పని చేస్తూ అనేక మందితో చిట్టీలు వేయించాడు. తాను కూడా రూ.5 లక్షల చిట్టీ వేశాడు.
చిట్ ఫండ్ బోర్డు తిప్పేయడంతో దీంతో చిట్టీలు కట్టిన వారికి సమాధానం చెప్పలేక, డబ్బులు తిరిగి ఇవ్వలేక.. తాను నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి వెనక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.