వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న చిట్​ఫండ్​సంస్థలు

అధిక వడ్డీ ఆశ చూపి చిట్టీ డబ్బులను డిపాజిట్స్‌‌‌‌ రూపంలో తీసుకుని ఆ డబ్బును ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టి కొన్ని చిట్​ఫండ్​సంస్థలు ​వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెడ్తున్న ఈ డబ్బంతా చిట్​ఫండ్​సంస్థల సభ్యులదే. దాని నిర్వాహకులది ఎంత మాత్రం కాదు. సభ్యుల నుంచి డిపాజిట్స్‌‌‌‌ రూపంలో తీసుకున్న డబ్బును తమ ఇతర వ్యాపార సంస్థలకు పెట్టుబడిగా తరలించడం ఆర్థిక నేరమని1982 చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌తో పాటు1999లో వచ్చిన చట్టాలు చెప్తున్నా కొన్ని సంస్థలు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఒక చిట్​ఫండ్​సంస్థను ఆదర్శంగా తీసుకొని మరి కొందరు సొంతంగా చిట్‌‌‌‌ఫండ్స్‌‌‌‌ సంస్థలు స్థాపించి మదుపరుల డబ్బును రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ రంగాలకు యథేచ్ఛగా తరలించి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వరంగల్‌‌‌‌ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.

కేరళలో పుట్టి.. దేశమంతా వ్యాప్తి

చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థల చారిత్రక నేపథ్యాన్ని, వాటి నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను ఓ సారి పరిశీలిద్దాం. చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలు మన దేశంలో పురుడు పోసుకున్నది కేరళ రాష్ట్రంలో. అక్కడి నుంచి అవి క్రమంగా దేశమంతటా విస్తరించాయి. కేరళ రాష్ట్రంలో మలబార్‌‌‌‌ జిల్లా కలెక్టరుగా పనిజేసిన విలియం అగన్‌‌‌‌ 1894లో కొంతమంది వ్యక్తులను సమీకరించి వారిని ఒక గ్రూపుగా ఏర్పరచి ఆ గ్రూపులోని సభ్యులు ప్రతీ నెల ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ చెల్లించాలని ఎవరికి ఏ నెలలో అవసరముంటే వాళ్లే చిట్టీ ఎత్తుకోవాలని సూచించారు. చిట్టీ ఏ నెలలో ఎత్తుకున్నా, సభ్యులకు వచ్చే డబ్బు ఒకే విధంగా ఉంటది.1897లో తొలిసారి చిట్టీల నిర్వహణలో లాటరీ పద్ధతి ప్రవేశించింది. లాటరీలో ఎవ్వరికి చిట్టీవస్తే వాళ్లకు ఇచ్చేవారు. 1910 తర్వాత వేలంపాట ద్వారా చిట్టీ ఎత్తుకునే పద్ధతి చిట్టీ నిర్వాహకులకు కమీషన్ల వ్యవహారం వచ్చాయి. 1930లో కేరళలోని కొన్ని స్థానిక బ్యాంకులు వీటిని నిర్వహించాయి. 1960 నుంచి వీటి నిర్వహణ కేరళ స్టేట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది.1960 తర్వాత చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ వ్యాపారం దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. దేశంలో నేడు కొన్ని వేల రిజిస్టర్డ్ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలుంటే, అసంఖ్యాక అన్‌‌‌‌రిజిస్టర్డ్ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలున్నాయి. వీళ్ల వ్యాపార లావాదేవీలు లక్షల కోట్లలో ఉంటది. 

చట్టాలు ఏం చెబుతున్నాయి?

దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చిన ఈ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థల వ్యాపారాన్ని నియంత్రించేందు చట్టాలు చాలా వచ్చాయి. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రాష్ట్రం కొన్ని చట్టాలు చేసింది.  కేంద్ర ప్రభుత్వం1982లో దేశంలోని చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలన్నిటికీ వర్తించే కొన్ని చట్టాలను చేసింది. ఈ చట్టం ప్రకారం చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలు తమ సంస్థల డబ్బులను వేరే వ్యాపార రంగాలకు పెట్టుబడులుగా తరలించడం నేరం. చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ నిర్వాహకుడు పబ్లిక్‌‌‌‌ మనీ మ్యానేజింగ్‌‌‌‌ వ్యక్తి మాత్రమే. చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ డబ్బులను వేరే రంగాలకు తరలించే అధికారం అతనికి లేదని పేర్కొంటున్నాయి.1999లో వచ్చిన డిపాజిట్‌‌‌‌ దారుల హక్కుల పరిరక్షణ చట్టం డిపాజిట్‌‌‌‌ దారుల డబ్బును వేరే రంగాలకు తరలించడం నేరం అని పేర్కొంటున్నది. చట్టాలు ఎన్ని వచ్చినా దేశంలోని చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థల ఆగడాలను మాత్రం నియంత్రించలేక పోతున్నాయి. ప్రభుత్వాలు వీటిపై నిఘా ఉంచడంతోపాటు ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి. 

వరంగల్ ​జిల్లాలో అధికం..

వరంగల్‌‌‌‌ జిల్లాలో ఉన్నన్ని చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలు తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా లేవు. ఈ సంస్థల నిర్వాహకులు కొందరు తమ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థలో సభ్యులుగా చేరిన వారి డబ్బులతో వరంగల్‌‌‌‌కున్న ప్రధాన జాతీయ రహదారుల ఇరువైపుల భూములు కొని ప్లాటింగ్‌‌‌‌ చేస్తున్నారు. సభ్యులు సంస్థల్లో చిట్టీ ఎత్తుకొని ఐదారు నెలలు గడిచినా.. డబ్బులు చెల్లించకుండా, వాయిదా వేస్తున్నారు. లేదంటే తమ వెంచర్లలోని ప్లాట్లను మార్కెట్‌‌‌‌ విలువ కంటే రెట్టింపు రేటుతో అంటగడుతున్నారు. ఈ మధ్య కాలంలో చిట్టీ ఎత్తుకున్న ఓ వ్యక్తి తనకు ప్లాట్‌‌‌‌ అవసరం లేదని తను చెల్లించిన చిట్టీ డబ్బు తనకు చెల్లిస్తే చాలని తనను చిట్టీలో చేర్పించిన ఏజెంటును నిలదీయగా ఆ ఏజెంట్ ఆ వ్యక్తిపై పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన వరంగల్‌‌‌‌ జిల్లాలో పలువురిని కలవరానికి గురి చేసింది. వరంగల్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థల యజమానులు కొందరు తమ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థల్లోని సభ్యుల డబ్బును రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ రంగానికి తరలించి అక్రమంగా వందల కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వీళ్లు విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటే వీళ్ల చిట్టీల్లో సభ్యులుగా చేరిన వారు మాత్రం చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ ఆఫీసులు, రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ ఆఫీసులు, పోలీస్‌‌‌‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నరు. ఇక్కడ చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ సంస్థల బాధితులంతా వేలల్లోనే ఉంటరు. వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులందరిది.