- కస్టమర్ల డబ్బులే పెట్టుబడి
- గ్రూపుల్లో ఎక్కువ మంది ఫేక్ కస్టమర్లే
- తెల్ల పేపర్లపై సంతకాలు తీసుకుని మోసాలు
- వేలల్లో బాధితులు.. కొన్నే పోలీస్ కంప్లయింట్స్
- ఎమ్మెల్యేలు, లీడర్ల అండతో రెచ్చిపోతున్నరు
వరంగల్, వెలుగు : రాష్ట్రంలో బడా చిట్ ఫండ్ కంపెనీలు పేద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీవితాలతో ఆడుకుంటున్నాయి. చిట్‍ఫండ్స్ పేరుతో ‘రియల్’ దందా చేస్తున్నాయి. ఉమ్మడి వరంగ్జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఈ బిజినెస్ఎక్కువగా రన్అవుతోంది. గ్రూప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలుకుంటే అయిపోయే వరకు కస్టమర్లను అష్టకష్టాలు పెడుతున్నారు. దీంతో ఇంటి జాగా కోసమో..బిడ్డల పెండ్లిళ్ల కోసమో, కష్టకాలంలో పైసలు ఉపయోగపడతాయని చిట్వేసిన వారు మోసపోతున్నారు. చీట్చేశారని పీఎస్‌కు వెళ్లినా, చిట్ రిజిస్ట్రార్ ను కలిసినా న్యాయం జరగడంలేదు. చిట్ ఫండ్స్ఓనర్లకు ఎవరో ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ లీడర్ సపోర్ట్ ఉండడంతో బాధితుల గోడు వినేవారు ఉండట్లేదు. ఈ బాధితుల సంఖ్య వేలల్లో ఉండగా.. కంప్లయింట్స్ మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి.
డబ్బులన్నీ రియల్ దందాలోకే..
చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చిట్ ఫండ్ సంస్థలు జనాల చిట్టీ డబ్బులతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాయి. చిట్టి అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇతర వ్యాపారాల్లో పెట్టకూడదనే రూల్ ఉన్నా పట్టించుకోవట్లేదు. కస్టమర్ల నుంచి వచ్చే మొత్తంలో 70 నుంచి 80 శాతం రియల్ ఎస్టేట్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. చిట్టీ వేసిన వ్యక్తి పాట పాడి దక్కించుకున్నా డబ్బులు ఇన్‌టైంలో ఇవ్వడంలేదు. చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చీట్ చేస్తున్నారు. తమ దగ్గర డబ్బులు లేవని బదులుగా తమ వెంచర్లలో ప్లాట్ తీసుకోవాలని చెప్పి బలవంతంగా ఎక్కువ ధరలకు అంటగడుతున్నారు.
దొంగ గ్రూపులు
కస్టమర్లకు మొదట ఫలానా నెల మీకే అంటూ రాంగ్ కమిట్మెంట్ఇచ్చి జాయిన్ చేసుకుంటున్నారు. 50 మందితో గ్రూప్ ఉందని చెప్పి 10 నుంచి 15 మంది డమ్మీల పేర్లు పెడుతున్నారు. ఇలా మొదట్లో ప్రతి నెలా చిట్టీ సంస్థకే వచ్చేలా ఏజెంట్లతో కలిసి ప్లాన్ చేస్తున్నారు. కస్టమర్లు ఇచ్చే డబ్బులను డమ్మీల పేరుతో ఎత్తుకుని రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మధ్యలో అసలు కస్టమర్లు ఎవరైనా ఎక్కువకు పాట పాడుకున్నా అవసరానికి మించి ష్యూరిటీలు అడిగి తిప్పుకుంటున్నారు. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. చిట్టీ లిఫ్ట్ చేసిన తర్వాత వారి దగ్గరి నుంచి 30 నుంచి 40 సంతకాలు తీసుకుంటున్నారు. వివరాలు తర్వాత రాసుకుంటామంటూ ఖాళీ పేపర్లపై సిగ్నేచర్స్ పెట్టించుకుంటున్నారు. అమౌంట్ నాలుగైదు విడతల్లో ఇస్తామంటూ చెక్కులు అంటగడుతున్నారు. మోసం చేశారని ఎవరైనా పీఎస్‌కు వెళ్తే వైట్ పేపర్లపై చేసిన సంతకాలను చూపించి బెదిరిస్తున్నారు.
లీడర్ల అండతో ..
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ఇతర జిల్లాల్లోనూ చిట్ఫండ్స్నడిపే టాప్ 10 చిట్ కంపెనీల వెనక ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన పెద్ద లీడర్లు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కస్టమర్ల డబ్బులతో చేసే రియల్ ఎస్టేట్ లో సహకారం అందించడానికి పార్ట్‌నర్స్‌గా లేదంటే పర్సంటేజీ తీసుకుని సహకరిస్తున్నారంటున్నారు. హన్మకొండలో ఓ నలుగురు చిట్‍ఫండ్ ఓనర్లు సిండికేట్‍గా మారి రైల్వే ట్రాక్ వచ్చే రూట్లో వందల ఎకరాల్లో ప్రైవేట్ వెంచర్లు వేశారు. వాటికి డిమాండ్ తెచ్చే క్రమంలో 15–20 కిలోమీటర్ల దూరం విశాలమైన డబుల్ రోడ్లు వేయడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సహకరించారు. దీనికోసం వెంచర్ల అవతల 'సర్కారు వెంచర్' మొదలుపెట్టారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో రోడ్డు డెవలప్ చేయడం ద్వారా చిట్‍ఫండ్ ఓనర్లు ఇదే రోడ్డులో స్టార్ట్‌చేసిన ప్రైవేట్ వెంచర్లకు రూట్ క్లియర్ చేశారు. తీరా చూస్తే ప్రైవేట్ వెంచర్లు లాభాల బాటలో నడవగా సర్కారు తరఫున చేపట్టిన వెంచర్ వెనకబడిపోయింది. కార్పొరేషన్ కు చెందిన ఓ పెద్ద మనిషిని ముందుపెట్టి ఈ తతంగం నడిపించారని చెబుతున్నారు.
పోలీసుల ఫోకస్
చిట్టీ మోసాలు పెరిగిపోతుండడంతో వరంగల్ పోలీసులు ఓనర్లు, ఏజెంట్లపై ఫోకస్ పెట్టారు. ఇది వరకే కౌన్సెలింగ్ ఇచ్చిన సీపీ తరుణ్‌జోషి.. మోసాలు చేసిన బడా చిట్‌ఫండ్స్‌కు చెందిన నలుగురు ఓనర్లను బుధవారం అరెస్ట్ చేశారు.
లోపాలున్నా పర్మిషన్లు ఇస్తున్రు
చిట్‍ఫండ్ సంస్థలు కొత్త చిట్టి గ్రూపులు స్టార్ట్ చేసేప్పుడు అంతే మొత్తంలో గ్యారంటీ చూపాల్సి ఉంటుంది. అయితే చాలా కంపెనీలు తక్కువ వాల్యూ ఉంటే ఎక్కువగా చూపుతున్నాయి. అన్ని గ్రూపులకు ఒకే ప్రాపర్టీని చూపెడుతున్నాయి. ఇవన్నీ రిజిస్ట్రార్‍కు తెలిసినా పట్టించుకోకుండా పర్మిషన్లు ఇస్తున్నారు. చిట్‍ఫండ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ రికార్డులు, చెక్స్ స్టేటస్ చూడాల్సి ఉండగా దాన్నసలు పరిగణలోకే తీసుకోవడం లేదు.
అచల చిట్ ఫండ్‍పై మరో ఎఫ్‍ఐఆర్
వరంగల్ క్రైం : హనుమకొండ నక్కలగుట్టలోని అచల చిట్‌ఫండ్స్‌పై గురువారం మరో కేసు నమోదైంది. బాలసముద్రానికి చెందిన కటకం శ్రావణ్‍కుమార్ అచల చిట్స్‌లో రూ.50 లక్షల చిట్టి వేశాడు. గతేడాది ఆగస్టు 30న లిఫ్ట్ చేయగా రూ.37 లక్షల 25 వేలు రావాల్సి ఉంది. డబ్బులు అడిగితే చిట్ ఫండ్ చైర్మన్ పంచగిరి సత్యనారాయణ, అతని కొడుకు దుశ్యంత్, ఏజెంట్ మహ్మద్ ఇమామొద్దీన్ బెదిరించారు. దీంతో బాధితుడు కంప్లయింట్ ఇవ్వడంతో ఎఫ్‍ఐఆర్ నమోదు చేశామని సుబేదారి సీఐ రాఘవేంద్రరావు తెలిపారు. ఇదే చిట్‍ఫండ్ కస్టమర్ అయిన పిట్టల రాజు డబ్బులు అడుగుతున్నాడని ఏజెంట్ గణేశ్ దంపతులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో గత ఏడాది సెప్టెంబర్ 3న రాజు చనిపోయాడు. కాగా బుధవారం ఓ కేసులో అచల చిట్‍ఫండ్స్ ఓనర్లు సత్యనారాయణ దంపతులను అరెస్ట్ చేయగా రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే .