రూ.50 కోట్ల చిట్​ఫండ్ మోసం కేసులో ఐదుగురు అరెస్ట్

రూ.50 కోట్ల చిట్​ఫండ్  మోసం కేసులో ఐదుగురు అరెస్ట్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : చిట్ ఫండ్  పేరుతో మోసం చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్  తెలిపారు. ఎస్పీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. సాయిబాబు 1995లో ఓం సాయిరాం ఫైనాన్స్  ఏర్పాటు చేసి, 1542 మంది బాధితుల నుంచి రూ.50 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశాడని తెలిపారు. పీఆర్ఎల్ఐలో ముంపు భూములకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం డబ్బులు సాయిబాబుకు ఇచ్చి మోసపోయారని చెప్పారు.

సాయిబాబు సిండికేట్ గా మరికొందరిని ఏర్పాటు చేసి ఫిక్స్డ్​ డిపాజిట్  పేరుతో డబ్బులు స్వాహా చేశారని తెలిపారు. లైసెన్స్  లేని ఫైనాన్స్  పేరుతో బాండ్  పేపర్  తయారు చేసి బాధితులకు ఇచ్చారని చెప్పారు. ఇలా తీసుకున్న డబ్బులతో రియల్  ఎస్టేట్  వ్యాపారం చేసి ఆ భూములను కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్  చేయించాడని తెలిపారు. త్వరలో వీటిని జప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

సాయిబాబుతో పాటు సాయి దీక్షిత్, మాజీ సర్పంచ్  శ్రీనివాసులు, జువ్వ వెంకటేశ్వర్లు, హుస్సేన్ ను అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. అడిషనల్  ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కనకయ్య, సీసీఎస్  సీఐ శంకర్  పాల్గొన్నారు.