- ఓరుగల్లు కేంద్రంగా 300 సంస్థలు
- రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలతో దందా
- కస్టమర్ల సొమ్ముతో రియల్ ఎస్టేట్‌వ్యాపారం
- చిట్టీ ముగిసినా డబ్బులివ్వకుండా సతాయింపులు
- రూ. వందల కోట్లతో బోర్డులు తిప్పేస్తున్న సంస్థలు
- ఆఫీసుల ముందు బాధితుల ఆందోళనలు
- కౌన్సెలింగ్, చీటింగ్ కేసులతో సరిపెడ్తున్న పోలీసులు
వరంగల్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్‍ఫండ్స్ కంపెనీలు చీటింగ్‍కు కేరాఫ్‌గా మారుతున్నాయి. పిల్లల చదువులకో, పెండ్లిళ్లకో, జాగ కోసమో, ఇల్లు కొనుక్కునేందుకో ఉపయోగపడ్తాయని పైసాపైసా కూడబెట్టి చిట్టీలు వేస్తున్న పేద, మిడిల్క్లాస్జనాలను నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. చిట్టీలు, డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ.వందల కోట్లను రియల్ఎస్టేట్వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అకౌంట్లలో డబ్బులు లేకున్నా ఉత్తుత్తి చెక్కులిచ్చి గడువుల మీద గడువులు పెంచుకుంటూ తిప్పుకుంటున్నారు. చివరికి డబ్బులకు బదులుగా తమ వెంచర్లలో ప్లాట్లు తీసుకోవాలని, లేదంటే మీ ఇష్టమున్నట్లు చేసుకొమ్మంటూ దబాయిస్తున్నారు. ఇలా ఒక్క వరంగల్కేంద్రంగానే సుమారు 300 దాకా చిట్ఫండ్స్కంపెనీలు నడుస్తుండగా, ఇందులో దాదాపు అన్ని ఆఫీసులూ రోజూ వచ్చిపోయే బాధితుల నిరసనలతో హోరెత్తుతున్నాయి. చిట్కంపెనీల ఓనర్లంతా పొలిటికల్ పవర్ ఉన్నోళ్లే కావడంతో పోలీసులు కేవలం ఫిర్యాదులు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. మహా అయితే కౌన్సిలింగ్, చీటింగ్ కేసులతో మమ అనిపిస్తున్నారు. దీంతో లక్షలాది మంది బాధితులు ఏం చేయాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు.
డమ్మీ పేర్లు...టైంకు పైసలియ్యరు
చిట్ ఫండ్ సంస్థలు సీనియర్ ఏజెంట్లను ముందుపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నాయి. ‘ఫలానా నెల చిట్టీ మీకే’ అని రాంగ్ కమిట్మెంట్లు ఇస్తూ మోసం చేస్తున్నారు. 50 మందితో గ్రూప్ ఉంటే అందులో 10 నుంచి 15 మంది సంస్థకు చెందిన డమ్మీ పేర్లు పెడుతున్నారు. చిట్టీ ఎత్తుకుంటే ష్యూరిటీ ఫాం ఇవ్వకుండా టైం వేస్ట్చేస్తున్నారు. గ్యారంటీల విషయంలోనూ ‘ఫలానా ఉద్యోగులే ఉండాలి. ఇన్ని వేల జీతం క్రెడిట్కావాలి’ అంటూ కొర్రీలు పెడుతున్నారు. గ్యారంటీ సంతకాలు చేయించిన తర్వాత చివర్లో ఏదో కారణం చెప్తూ రిజెక్ట్చేస్తున్నారు. ఇవన్నీ దాటొచ్చే కస్టమర్లకు డబ్బులివ్వకుండా..బ్యాంకర్లతో జత కలిసి పోస్ట్డేటెడ్చెక్కులిస్తున్నారు. ఇలా ఆరు నెలల నుంచి ఏడాది పాటు తిప్పుకుంటున్నారు. వివరాలు తర్వాత రాసుకుంటామంటూ చిట్ హోల్డర్లతో ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు. సంస్థ చేస్తున్న మోసాలపై బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ఇస్తే తెలియక చేసిన సంతకాలను చూపిస్తూ కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
రూల్స్ బ్రేక్ చేస్తున్నా..పట్టించుకోవట్లే..
కొత్త చిట్టీ గ్రూపులు స్టార్ట్ చేసే సమయంలో అంతే గ్యారంటీ చూపాల్సి ఉండగా..సంస్థలు తక్కువ వాల్యూ చూపుతున్నాయి. ‘చిట్ ఫండ్ రూల్స్’కు విరుద్ధంగా ఒకే ప్రాపర్టీని ఇతర గ్రూప్‌లకు చూపుతున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. చిట్ ఫండ్ ఫైనాన్షియల్ ట్రాన్‌శాక్షన్స్, బ్యాంకింగ్ కార్డులు, చెక్కులు స్టేటస్ చూడాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు లైట్తీసుకుంటున్నారు.
ఆ 10 కంపెనీల్లోనే అత్యధిక బాధితులు
వరంగల్ పాత సీపీ తరుణ్‍జోషి చిట్‍ఫండ్ మోసాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తుండడంతో గ్రేటర్ వరంగల్ కేంద్రంగా నడిచే కంపెనీలపై ఎంక్వైరీ చేయించారు. ఇందులో శుభనందిని, అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ లాంటి దాదాపు10 కంపెనీల్లో బాధితులు ఎక్కువున్నట్లు గుర్తించారు. 2021 ఆగస్ట్ 6న కమిషనరేట్ పరిధిలోని చిట్‍ఫండ్ సంస్థల ఓనర్లను పోలీస్ హెడ్‍క్వార్టర్స్ కు పిలిపించిన వార్నింగ్ఇచ్చి పంపించారు. అదే ఏడాది సెప్టెంబర్3న హనుమకొండ చౌరస్తాలో సెల్ ఫోన్ షాప్ నడుపుకునే పిట్టల రాజు చిట్టీ పైసలడిగినందుకు అచల చిట్‍ఫండ్ ఏజెంట్ గొడుగు గణేశ్ పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో రాజు చనిపోగా, ఇతడి భార్య సిరి, మరొకరు గాయపడ్డారు. చిట్ఫండ్సంస్థల కేసును టాస్క్ ఫోర్స్ఇన్చార్జి అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్‍కు అప్పజెప్పగా...అచల, అక్షర, కనకదుర్గ చిట్‍ఫండ్స్ ఓనర్లను అరెస్ట్ చేశారు. మరో రెండు కంపెనీల యజమానులు పరారయ్యారు. తరుణ్ జోషి తర్వాత వచ్చిన ఏవీ.రంగనాథ్ కూడా నిఘా కొనసాగించారు. పోలీస్ స్టేషన్ల వారీగా బాధితుల జాబితాలు పంపి సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేశారు.
ఓరుగల్లుకు క్యూ కడుతున్న బాధితులు
రాష్ట్రంలో ఓరుగల్లు కేంద్రంగా మెజారిటీ చిట్ ఫండ్ సంస్థలు బిజినెస్ చేస్తున్నాయి. జిల్లాల్లో అందుబాటులో ఉండే మేనేజర్లు, ఏజెంట్లతో రూ. వందల కోట్లను చిట్స్, డిపాజిట్ల రూపంలో సేకరించాయి. చీటి ఎత్తుకున్నోళ్లు, గడువు ముగిసినోళ్లు డబ్బుల కోసం జిల్లా కేంద్రాల్లోని బ్రాంచులకు వెళితే నెలల తరబడి తిప్పుకుంటున్నారు. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ లాంటి దాదాపు 25 జిల్లాల నుంచి వరంగల్‌లోని చిట్‍ఫండ్స్ హెడ్ఆఫీసులకు క్యూ కడుతున్నారు. మేనేజ్మెంట్ను కలిసి తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే డబ్బులు అడ్జస్ట్చేయలేమని, ఉమ్మడి వరంగల్ చుట్టూ తాము వేసిన వెంచర్లలో ప్లాట్లు తీసుకోవాలని కోరుతున్నారు. నిరాకరించిన వారిని రేపు మాపంటూ తిప్పుకుంటూ సతాయిస్తున్నారు. దీంతో బాధితులు హెడ్ఆఫీసుల ముందే ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు. వరంగల్‌లో ఉండే చెప్పుకోదగ్గ చిట్ సంస్థల ముందు రోజూ ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. అయితే, పోలీసులు బాధితులను సముదాయించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
వెంచర్లో ప్లాట్ తీసుకోమంటున్రు
నేను జగిత్యాలలోని ఓ చిట్ ఫండ్ కంపెనీలో 2020లో రూ.10 లక్షలు, రూ.5 లక్షలు చిట్టీలు వేసిన. బిడ్డ పెండ్లి కోసం ఓ చిట్టీ ఎత్తుకున్న. ఇంకో చిట్టీ రావాల్సి ఉంది. డబ్బుల కోసం లోకల్ మేనేజర్ దగ్గరకు తిరిగి తిరిగి అలసిపోయిన. పనయ్యేలా లేదని హనుమకొండలోని మెయిన్ ఆఫీస్‍కు వచ్చిన. రేపిస్తాం మాపిస్తామంటూ చాలాసార్లు తిప్పుకున్నరు. ఇప్పుడెమో వాళ్ల
వెంచర్లో ప్లాట్ తీసుకోవాలంటున్నరు. డబ్బులే కావాలంటే ఇప్పుడు లేవని చెబుతున్నరు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మా డబ్బులు మాకు ఇప్పించాలి.
- వి.శారద (వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా)
చిట్టీ పూర్తయినా.. ఏండ్లుగా తిప్పుతున్నరు..
మేం హనుమకొండ నక్కలగుట్ట కేంద్రంగా పనిచేసే అక్షర చిట్ ఫండ్‍లో చిట్టీలు వేసినం. మూడు, నాలుగేండ్ల కిందటే గడువు ముగిసింది. అప్పటి నుంచి టైం మీద టైం పెడ్తున్నరు. 3 నెలల క్రితం డబ్బుల కోసం నిరసనకు దిగినం. దీంతో డిసెంబర్15 వరకు గడువు పెట్టిన్రు. ఎక్కడెక్కడి నుంచో పొద్దున్నే ఇక్కడికొస్తున్నా చైర్మన్ ఆఫీసులో ఉండడం లేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. స్టాఫ్ ను అడిగితే తమ చేతిలో ఏం లేదంటున్నరు. నిరసన చేస్తుంటే..పోలీసులు వచ్చి గొడవ చేయద్దు. కేసులు అవుతయంటున్నరు.
- నక్కలగుట్టలోని అక్షర చిట్ ఫండ్ వద్ద బాధితులు