మంజీరా నదీ తీరంలో మహిమగల తల్లిగా పూజలందుకుంటోంది చిట్కుల్ చాముండేశ్వరి దేవి. మెదక్ జిల్లాలోని చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో ఉంది ఈ గుడి. ఈ గుడి దక్షిణ భారతదేశంలోనే రెండో చాముండేశ్వరి దేవి ఆలయం కావడం విశేషం. ఏడాది పొడవునా ఇక్కడ మొక్కులు చెల్లించు కుంటారు భక్తులు. ఏటా జనవరిలో మూడు రోజులు ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈసారి జనవరి 22, 23, 24 తేదీల్లో ఆలయ వార్షికోత్సవాలు జరగనున్నాయి.
ఎక్కడైనా ముందుగా గుడి కట్టి, తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే ఆలయాన్ని నిర్మించారు. ఐలవజ్జల వంశానికి చెందిన శ్రీ వెంకటరమణయ్య అనే వ్యక్తి ‘శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాక్తమండల్’ ఏర్పాటు చేశాడు. ఈయనే 1983లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపచేశాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఏకశిల రాయిని తెప్పించి, తమిళనాడుకు చెందిన శిల్పులతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు. తొమ్మిది అడుగుల ఎత్తు,18 చేతుల్లో ఆయుధాలు, కిరీటంతో ఉన్న అమ్మవారు శక్తి స్వరూపిణిగా కనిపిస్తారు. ఈ గుడిలో ఎత్తైన గోపురం, విశాలమైన మండపం ఉంటుంది. కోనేటిలో స్నానం చేసి, తడి బట్టలతో గుడిచుట్టూ11 ప్రదక్షిణలు చేస్తే, అనుకున్నవి జరుగుతాయని, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్తారు. ఇక్కడ బ్రహ్మీ దేవీ, కాళీ మాత, వైష్ణవీ మాత విగ్రహాల్ని కూడా చూడొచ్చు.
నైవేద్యంగా పెరుగన్నం
గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ఒకవైపు మహిషాసురుడు, మరోవైపు సింహం బొమ్మలు ఉంటాయి. అమ్మవారికి కుంకుమతో అర్చన జరిపించి, ఒడిబియ్యం పోసి, కొబ్బరికాయ ముడుపులు కడతారు. ఇలాచేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తారు. ప్రతిఏడాది జనవరిలో మూడు రోజులు ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి వార్షికోత్సవాల కోసం ‘చాముండేశ్వరి సేవాసమితి శాక్త మండల్’ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు, కార్తికమాసం పూజలు కూడా కన్నులపండుగగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఏడాది పొడవునా భక్తులు వస్తారు ఇక్కడికి.
ఇలా వెళ్లాలి
జోగిపేట్ నుంచి 6.8 కి.మీ.దూరం ఉంటుంది చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం. మెదక్ నుంచి 32 కి.మీ, హైదరా బాద్ నుంచి 96 కి.మీర్లు జర్నీ చేయాలి. బాలానగర్ – మెదక్ నేషనల్ హైవే మీదుగా వెళ్లేవాళ్లు... కొల్చారం మండలం పోతంశెట్పల్లి చౌరస్తా నుంచి జోగిపేట్ రూట్లో వెళ్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
మెదక్, చిలిప్చేడ్, వెలుగు