అక్రమాల ‘చిత్రపురి’ సొసైటీ కమిటీని రద్దు చేయాలి: రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్

అక్రమాల ‘చిత్రపురి’ సొసైటీ కమిటీని రద్దు చేయాలి: రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్
  • అక్రమాల ‘చిత్రపురి’ సొసైటీ కమిటీని రద్దు చేయాలి
  • చిత్రపురి కాలనీ స్కాం తెలంగాణలో అతి పెద్ద కుంభకోణం
  • రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన అతిపెద్ద కుంభకోణం మణికొండ చిత్రపురికాలనీ స్కాం అని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ.. చిత్రపురి కాలనీ బాధితులకు అండగా ఉంటామని, అవినీతి అధికారులను జైలుకు పంపించే వరకూ వదిలి పెట్టబోమని చెప్పారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మాట్లాడుతూ... చిత్రపురి కాలనీ స్కాంను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, అక్రమాలకు పాల్పడిన చిత్రపురి కాలనీ సొసైటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి.నరసింహరావు మాట్లాడుతూ.. చిత్రపురి అక్రమార్కుల భరతం పట్టేవరకూ వదిలేది లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.బాలరాజ్ మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు అండగా నిలస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ చాలా కాలంగా చిత్రపురి అవినీతిపై పోరాడుతోందన్నారు.

టీజేస్ నాయకుడు నర్సయ్య మాట్లాడుతూ.. చిత్రపురి కాలనీ కుంభకోణంపై తమ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం గతంలో మాట్లాడారని, ఈ అంశంపై వామపక్ష పార్టీలు, ఆప్, టీజేఎస్ నేతలంతా కలిసి త్వరలో సీఎంను కలుద్దామని కోరారు. సీనియర్​నేత దేశ్ పాండే మాట్లాడుతూ.. చిత్రపురి కాలనీ అక్రమాలపై చేస్తున్న పోరాటంలో తాను నాలుగేండ్లుగా పాల్గొంటున్నానని, ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.

అనంతరం అన్నీ పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని, ప్రస్తుత అక్రమాల చిత్రపురి కమిటీని రద్దు చేసి, అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని అఖిల పక్షం నేతలు తీర్మానించారు. అన్ని పార్టీల అగ్రనేతలను కలుపుకు పోవాలని నిర్ణయించారు. సమావేశంలో నేతలు శ్యాంరావ్, కస్తూరి శ్రీనివాస్, భద్ర, సంకూరి రవీందర్, విజయ్ మల్లంగి, యమునా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.