చిట్టీల పుల్లయ్య చిక్కిండు.. బెంగళూరులో తండ్రీకొడుకులు అరెస్ట్

చిట్టీల పుల్లయ్య చిక్కిండు.. బెంగళూరులో తండ్రీకొడుకులు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: చిట్టీల పేరుతో వందల మందిని మోసగించి, రూ.100 కోట్లతో పరారైన తండ్రీ కొడుకులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకుని సిటీకి తీసుకొచ్చారు. ఏపీలోని అనంతపురానికి  చెందిన పుల్లయ్య కొన్నేండ్ల కింద హైదరాబాద్ కు వలస వచ్చాడు. 

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడ రవీంద్రనగర్ లో ఉంటున్నాడు. పుల్లయ్య కూలి పనులకు వెళ్తుండగా, అతని కొడుకు రామాంజనేయులు తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. పుల్లయ్య కూలి పనులకు వెళ్తూనే చిట్టీల పేరుతో స్థానికులు, తోటి కూలీలు, బంధువుల నుంచి దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశాడు.

 చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత నెలలో కొడుకు రామాంజనేయులుతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో మధురానాగర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తర్వాత వాటిని సీసీఎస్ పోలీసులను బదిలీ చేశారు. 

తాజాగా పుల్లయ్య, రామాంజనేయులును బెంగళూరులో గుర్తించిన సీసీఎస్​పోలీసులు సిటీకి తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్​ వేశారు. విచారణలో రూ.100 కోట్లను ఏం చేశారో తెలిసే అవకాశం ఉందని సీసీఎస్ ఏసీపీ మల్లికార్జున చౌదరి తెలిపారు.