చిట్యాలలో 862 కేజీల గంజాయి స్వాధీనం

నార్కట్‌పల్లి, వెలుగు: రూ. 1.29 కోట్ల విలువ చేసే 862 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్​లో శుక్రవారం ఎస్పీ రెమా రాజేశ్వరి కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమ్మద్ హైదర్ అలీ, ప్రతాప్ డ్రైవర్లు. కర్నాటక రాష్ట్రానికి చెందిన శివాజీ రాథోడ్, అతని సోదరుడు వెంకట్ రాథోడ్, వారి బావ మహదేవ్ జాదవ్ తో కలిసి కొద్ది రోజులుగా ఏపీలోని రాజమండ్రిలో గంజాయి కొని హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

గంజాయి అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు,ఎన్​ఫోర్స్​మెంట్​సిబ్బంది చిట్యాల పట్టణ శివారులోని చౌరస్తా వద్ద వెహికల్స్​తనిఖీ చేపట్టారు. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎంను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. మహమ్మద్ హైదర్ అలీ, డ్రైవర్​నసీరుద్దీన్, వెంకట్​రాథోడ్​ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత వెనకాల వచ్చిన కారును సైతం ఆపారు. వెంటనే శివాజీ రాథోడ్, చింటూ కారులోంచి దిగి పారిపోయారు. డ్రైవర్ మనోజ్ ను పట్టుకున్నారు. డీసీఎం, కారులో రూ. 1.29 కోట్లు విలువచేసే  862.50  కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.