ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రజలు జ్వరంతో విలవిలలాడుతున్నారు. చిట్యాలలోని గవర్నమెంట్​ హాస్పిటల్​కు రోగులు క్యూ కట్టారు. హాస్పిటల్ లో బెడ్స్ నిండిపోయాయి. అయితే ఈ ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో.. పని భారం పెరుగుతోంది. ఈక్రమంలో రోగులకు, సిబ్బందికి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. జిల్లా ఆఫీసర్లు స్పందించి, సమస్యను పరిష్కరించాలని పేషెంట్లు కోరుతున్నారు.

మల్లంపల్లిని మండలం చేయాలి

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేయాలని మంత్రి కేటీఆర్ కు గ్రామస్తులు విన్నవించారు. బుధవారం మండల సాధన సమితి సభ్యులు హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మల్లంపల్లికి అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నా  మండలంగా ఏర్పాటు చేయడం లేదన్నారు. గతంలో సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత 50 రోజులుగా మండలం కోసం రిలే దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే సీతక్క, మంత్రి దయాకర్​ రావు, ప్రభుత్వ విప్​ వినయ్​భాస్కర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు, కానుగంటి సతీశ్, కుక్కల సంపత్​, ఎడ్ల అనిల్ రెడ్డి, వనపాకల దిలీప్​, పొనుగోటి రవి, అల్లెపు రాజు, తోటకూరి శ్రీకాంత్​, గాజు అజయ్​ ఉన్నారు. 

ల్యాండ్ మాఫియా కేసులో..టీఆర్ఎస్ మండలాధ్యక్షుడి అరెస్ట్

హసన్ పర్తి, నల్లబెల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా ఆరెపల్లిలో జులై 29న జరిగిన ల్యాండ్ మాఫియా కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. భూమి విషయంలో తుపాకీతో బెదిరించిన కేసులో ఇప్పటికే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ సంపత్ కుమార్, నయీం ప్రధాన అనుచరుడు ముద్దసాని వేణుగోపాల్ తో సహా పది మందిని అరెస్ట్ చేయగా.. తాజాగా బుధవారం రాత్రి వరంగల్ ​జిల్లా నల్లబెల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సారంగపాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన ఆరెపల్లితో పాటు అనేక భూవివాదాల్లో తలదూర్చినట్లు గుర్తించారు. కేయూ క్రాస్ రోడ్​లోని ఓ భూమి విషయంలో నయీం అనుచరుడు వేణుగోపాల్ గ్యాంగ్​తో కలిసి సెటిల్ మెంట్ కు పాల్పడ్డట్లు ఐటెండిఫై చేశారు. అలాగే నగరంలోని న్యూశాయంపేట, కరీమాబాద్, తాళ్ల పద్మావతి కాలేజీ, భట్టుపల్లి రోడ్, పైడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ సెటిల్ మెంట్లలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సైబర్ నేరాలపై అలెర్ట్ గా ఉండాలి

ఎల్కతుర్తి, వెలుగు: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించవద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. వాట్సాప్ లో ఇతర సామాజిక మాధ్యమాల్లో క్యూఆర్ కోడ్ లు స్కాన్ చేయవద్దన్నారు. బ్యాంక్ నుంచి కస్టమర్లకు ఎలాంటి ఫోన్లు రావని, ఒక వేళ వస్తే.. డైరెక్టుగా బ్యాంక్ కు వెళ్లి సంప్రదించాలన్నారు. యువత ఆన్ లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలన్నారు. ఒకవేళ డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నంబర్ కు లేదా డయల్ 100కు కాల్ చేయాలన్నారు.

జనగామ కమిషనర్​గా రజిత

జనగామ, వెలుగు: జనగామ మున్సిపల్ కమిషనర్​గా జంపాల రజిత బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన రవీందర్.. గ్రేటర్​ వరంగల్ ​మున్సిపల్ కార్పొరేషన్ కు బదిలీ అయ్యారు.​ నాగర్ కర్నూల్ మెప్మా అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​గా పనిచేస్తున్న రజితను జనగామ మున్సిపల్​ కమిషనర్​గా ఈనెల 6న బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం ఆమె బాధ్యతలు తీసుకున్నారు.

ఎస్ఆర్ యూనివర్సిటీలో ఏఐ, ఎంఎల్ వర్క్ షాప్

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంత శివారులో గల ఎస్ఆర్ యూనివర్సిటీ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), మెషిన్ లర్నింగ్(ఎంఎల్) కోర్సులపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వీసీ జీఆర్సీ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ రెండు కోర్సులు టెక్నాలజీ రంగంలో ట్రెండింగ్ గా మారాయన్నారు. రోబోటిక్, ఆటోమేషన్, స్మార్ట్ ట్రాన్స్​పోర్టేషన్ తదితర అప్లికేషన్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ వర్క్ షాప్​కు సైన్స్, అగ్రికల్చర్ ప్రొఫెసర్లు, ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ఎస్ మమత హాజరవుతారన్నారు.

అవ్వకు పింఛన్ గోస..

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె అగ్నిసమ్మకు 77 ఏండ్లు. భర్త వీరయ్య ఐదేండ్ల కింద చనిపోయాడు. ఒక కొడుకు మరణించగా.. ఇంకో కొడుకు వలస వెళ్లాడు. దీంతో ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. పింఛన్ కోసం నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా రకరకాల కారణాలతో ఆఫీసర్లు పింఛన్ ఇవ్వడం లేదు. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేదు. కొత్త పింఛన్ల పేర్లలోనూ అగ్నిసమ్మ పేరు లేదు. పెద్దాఫీసర్లు స్పందించి, పింఛన్ ఇప్పించాలని కోరుతోంది.

సీపీఐ గుడిసెలను తొలగించాలి

హనుమకొండ సిటీ, వెలుగు: వారసత్వంగా వచ్చిన భూముల్లో సీపీఐ లీడర్లు గుడిసెలు వేశారని, ప్రభుత్వ ఆఫీసర్లు తొలగించాలని వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంట శివారు ముస్కులపల్లి రైతులు కోరారు. బుధవారం హనుమకొండలో వారు మీడియాతో మాట్లాడారు. ముస్కులపల్లిలోని సర్వే నెంబర్లు 476, 484, 506లలో 22 ఎకరాల భూమి ఉందని.. అందులో నాలుగెకరాల్లో సీపీఐ లీడర్లు గుడిసెలు వేశారని తెలిపారు. గతంలో సీపీ తరణ్ జోషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేయగా.. సిబ్బంది వచ్చి తొలగించారని పేర్కొన్నారు. మళ్లీ సీపీఐ లీడర్లు గుడిసెలు వేశారని, వాటిని తొలగించాలని కోరారు.

యాక్సిడెంట్​లో వృద్ధురాలు మృతి

తొర్రూరు, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన తొర్రూరు మండలకేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన బందు సారెళ్ల(60) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం తెల్లవారు జామున ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మెయిన్​రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంజీ నాయక్​ తెలిపారు.