రైతు పరికరాలు చోరీ చేస్తే కఠిన చర్యలు : సీఐ మల్లేశ్

రైతు పరికరాలు చోరీ చేస్తే కఠిన చర్యలు : సీఐ మల్లేశ్

మొగుళ్లపల్లి, వెలుగు: రైతుల పంట పొలాల్లో ఉండే పరికరాలను చోరీ చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల సీఐ మల్లేశ్ హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అశోక్ తో కలిసి సీఐ మల్లేశ్ విలేకరులతో మాట్లాడారు..  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గణేశ్ పల్లి గ్రామానికి చెందిన రైతు వల్లాల రాజు నారాయణ  ట్రాక్టర్ ను ట్రాలీతో సహా పంటచేనులో ఉంచాడు. కొరికి శాల గ్రామ శివారులోని బద్దం పల్లె విలేజ్ కి చెందిన యల్ల చిరంజీవి ట్రాక్టర్ ట్రాలీని దొంగిలించి రంగును మార్చి తాను వాడుకుంటున్నాడు.

గురువారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చిరంజీవి పట్టుబడ్డాడు. తానే  ట్రాక్టర్ ట్రాలీ ఎత్తుకెళ్లినట్లు నేరం అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. చిరంజీవిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.  కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, హోంగార్డు రవికి సీఐ  రివార్డ్ అందించి అభినందించారు.