చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

అమీర్ పేట్, వెలుగు: పేపర్లు, ప్లాస్టిక్ సీసాలు ఏరుకుని,అమ్ముకుని బతికే కుటుంబం వారిది.. రోజూ మాదిరే గురువారం కూడా అమ్మానాన్నలు పనికి వెళ్లారు.. చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటోంది.. ఆమెపై ఓ కామాంధుడి కన్నుపడింది. చాక్లెట్లు ఆశచూపాడు.. పానీపూరి తినిపిస్తానని నమ్మించాడు. వెంట తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. హైదరాబాద్​లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ దారుణం. వివరాలను పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

చిన్నారి ఏడుస్తూ రావడంతో..

బీకే గూడ దగ్గర్లోని దసరం బాగ్ లో గుడిసెలు వేసుకుని కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి. చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ సీసాలు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతుకుతున్నాయి. అక్కడ నివసించే ఓ కుటుంబం 8 ఏళ్ల బాలికను ఇంటి దగ్గరే ఉంచి ఉదయాన్నే తమ పని మీద బయటికి వెళ్లింది. పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా.. అదే ప్రాంతానికి చెందిన నాగరాజు గమనించాడు. ఎవరూ లేరని తెలుసుకుని.. బాలిక దగ్గరికి వెళ్లాడు. చాక్లెట్స్, సమోసాలు, పానిపూరి తినిపిస్తానని చెప్పాడు. అతడి మాటలను నమ్మి బాలిక వెంట వెళ్లింది. ఆ చిన్నారిని సనత్ నగర్ లోని శ్యామలకుంట పార్క్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లిన నాగరాజు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో ఎస్ఆర్​నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించినట్టు ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

కొడుకుతో గొడవ : బిల్డింగ్ నుంచి దూకి తల్లి సూసైడ్