అలవోకగా 250 పరుగులు చేస్తూ.. ప్రత్యర్థి జట్లకు భయానక హెచ్చరికలు పంపిన సన్‌రైజర్స్ బ్యాటర్లు ఉన్నట్టుండి డీలా పడిపోయారు. కనీసం 200 లక్ష్యాలను చేధించలేక ఓటములు చవిచూస్తున్నారు. ఆర్సీబీపై 35 పరుగుల ఓటమిని ఓటమిని మర్చిపోక ముందే.. చెన్నై సూపర్ కింగ్స్ చేతితో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఛేజింగ్ అనగానే ఆరంజ్ ఆర్మీలో తడబాటు కనిపిస్తోంది. ఈ పాయింట్ ను హైలైట్ చేస్తూ భారత మాజీ దిగ్గజం ఒకరు.. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీని చోకర్స్ అని పిలుస్తూ దూషించారు.
మొదట బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్లు నమోదుచేసిన సన్‌రైజర్స్ (ఎస్‌ఆర్‌హెచ్) ఛేదనలో మాత్రం తడబడుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఔట్ అవ్వగానే.. మిగిలిన బ్యాటర్లు వారి వెంటే పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఓపెనర్లను ఔట్ చేస్తే.. ఆరంజ్ ఆర్మీ ఓటమి ఖాయం అన్నట్లుగా ఆడుతున్నారు. దీనిని హైలైట్ చేస్తూ భారత మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. హైదరాబాద్ జట్టును 'ఐపీఎల్ 2024 చోకర్స్' అని పిలిచారు.
ఐపీఎల్ 2024 చోకర్స్
"వారు(సన్‌రైజర్స్) ఈ ఏడాది ఐపీఎల్ లో చోకర్లుగా మారుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక, గత రెండు గేమ్‌లలో వారి ప్రదర్శన ఏంటో చూడండి. టాఫార్డర్ విఫలమవ్వగానే మిగిలిన బ్యాటర్లు మ్యాచ్ ను చివరివరకూ కూడా తీసుకెళ్లలేకపోయారు. వారి సమస్య ఏమిటంటే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్. వీరి మినహా మ్యాచ్‌లను గెలవగల బ్యాటర్లు వారికి లేకపోవడం. ఆ ముగ్గురే ఆ ఫ్రాంచైజీకి గుండె చప్పుడు. వారు డగౌట్‌కు తిరిగి వెళ్లారంటే హైదరాబాద్‌కు మ్యాచ్ గెలిచే అవకాశం ఉండదు.." అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అతని చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చెపాక్ గడ్డపై ప్యాట్ కమ్మిన్స్ సేన 78 పరుగుల భారీ తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది.