అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మా గ్రామాలను అభివృద్ధి చేయలేదు.. ఎందుకొచ్చారు.. అంటూ చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను, పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అయితే.. తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ ఏకంగా కడిగి పారేస్తున్నారు. తాజాగా చొప్పదండి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కోరెం గ్రామంలో చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కోరెం గ్రామ పంచాయితీ ఏకగ్రీవమైతే రూ. 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే.. ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు.
ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతే తమ ఊరికి రావాలని కోరెం గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కోరెం- గుండన్నపల్లి గ్రామల మధ్య బీటి రోడ్డు వేసి, వాగుపై కల్వర్ట్ నిర్మించాలని, గ్రామంలో దళిత బంధు ఇచ్చాకే తమ గ్రామానికి రావాలని ఫ్లెక్సీల్లో డిమాండ్ చేశారు.