రామడుగు, వెలుగు: పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు.
ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. దేశరాజ్ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు. అనంతరం దేశరాజ్‌పల్లి గ్రామం నుంచి గంగాధర వరకు బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఎంపీపీ కవిత, సర్పంచులు రమేశ్, సత్యప్రసన్న, ఎంపీటీసీ మహేందర్, డీఆర్డీఏ పీడీ శ్రీలత, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.
పేదలకు ఆరోగ్యశ్రీ వరం
పెద్దపల్లి, వెలుగు: పేదల హెల్త్‌కు ఆరోగ్యశ్రీ భద్రతనిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో సోమవారం రాజీవ్‌ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు స్కీమును ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ఉపయోగవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, ఆసుపత్రి సూపరిటెండెంట్ డా. రమాకాంత్, తహశీల్దార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం
గొల్లపల్లి, వెలుగు : ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గంగాపూర్ నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సును సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు కటారి చంద్ర శేఖర్ రావు, నిశాంత్ రెడ్డి, సర్పంచులు సత్యనారాయణ గౌడ్, గంగాధర్, రాజ్యలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.