ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గంగాధర, వెలుగు: తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే పండుగలకు ప్రాధాన్యత లభించిందని చొప్పదండి ఎమ్మెల్యే ఎస్.రవిశంకర్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని 6  మండలాల క్రిస్టియన్లకు మంగళవారం ప్రభుత్వం తరఫున కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్బండవర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. 

అన్ని వర్గాలకు సముచిత స్థానం

మెట్ పల్లి:  టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం మెట్ పల్లిలో నియోజకవర్గ క్రిస్టియన్లకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. అన్నివర్గాలకు లాభం చేకూరే విధంగా సీఎం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ వినోద్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ రామానుజ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్లు సుజాత, లావణ్య, వైస్ చైర్మన్లు చంద్రశేఖర్ రావు, పవన్ తదితరులు పాల్గొన్నారు. 

సెస్ కుంభకోణంలో కేటీఆర్ కు వాటా

తంగళ్లపల్లి,వెలుగు: గతంలో సెస్ ను దోచుకున్న వ్యక్తులను మళ్లీ సెస్ బరిలో ఉంచడం వెనుక మంత్రి కేటీఆర్ మతలబేంటని,సెస్ కుంభకోణంలో మంత్రికి కూడా వాటా ఉందని కాంగ్రెస్​స్టేట్​లీడర్ ​కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తంగళ్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సెస్ లో ఉన్న ఇనుప సామాను సైతం అమ్ముకున్న లీడర్లు ఇప్పుడు గెలిస్తే సెస్ బంగ్లా కూడా అమ్ముతారని ఆరోపించారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మండలాధ్యక్షుడు ప్రవీణ్, భూపతి, శ్రీనివాస్, రాజు, లీడర్లు పాల్గొన్నారు. 

రాష్ట్రానికి సీడ్ బౌల్ గా కరీంనగర్

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: జిల్లాలో 2014లో విత్తనోత్పత్తి పరిశ్రమలు 42 ఉండేవని ఇపుడు ఆ సంఖ్య 76 కు చేరుకుందని, కరీంనగర్ జిల్లా తెలంగాణకు  సీడ్ బౌల్ గా మారిందని ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మంగళవారం కరీంనగర్​ కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నీతి అయోగ్ సీఈఓ పరమేశ్వరన్ కు కరీంనగర్ జిల్లా ఆర్థిక వ్యవస్థ, పురోభివృద్ధికి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2014లో 10.7 ఉన్న జీడీపీపీ ప్రస్తుతం 21.3కు పెరిగిందని, విద్యుత్, గ్యాస్, వాటర్ సప్లైతోపాటు ఇతర వినియోగ సేవల్లో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలించిదని పేర్కొన్నారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం  ఏటా రూ.28.29 కోట్ల సహకారాన్ని అందిస్తోందన్నారు. జిల్లాకేంద్రంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ల కోసం 12 స్టార్టప్ ల ద్వారా 500 మందికి  ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్దేశంతో 81వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.41 కోట్లతో ఐటీ టవర్ ను నిర్మించుకున్నట్లు వెల్లడించారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనాతో రూ.675 కోట్ల వార్షిక ఆదాయం గడించేలా ఆయిల్​పామ్ సాగు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ లెనిన్ , వ్యవసాయ శాఖాధికారి శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం మహిళల నిరసన 

కోనరావుపేట, వెలుగు : కొన్ని రోజులుగా తాగడానికి మంచినీళ్లు రావడంలేదని మండలంలోని మల్కాపేట జీపీ ఎదుట మంగళవారం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సమస్యను సర్పంచ్ కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కార్యదర్శిని అడిగినట్లు పేర్కొన్నారు. ఈవిషయమై కార్యదర్శి గంగాధర్ వివరణ కోరగా నిరసన వ్యక్తం చేసిన వారింటికి వెళ్లి పరిశీలించానని, అందరికీ నల్లా నీళ్లు వస్తున్నాయన్నారు. కొందరు నల్లా నీళ్లతో ఇంటి ఆవరణలో కూరగాయల తోటలు కూడా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. 

సఫాయిమిత్ర డబ్బుతో పారిశుధ్య పనులు 

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: సఫాయి మిత్ర ప్రైజ్ మనీ రూ.4 కోట్లను పారిశుధ్య పనుల కోసం వినియోగిస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ ఆవరణలో రూ.20.5లక్షలతో కొనుగోలు చేసిన 70 రిక్షాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని 60 డివిజన్లలో ఇంటింటి నుంచి చెత్త కలెక్షన్ కోసం ప్రతీ డివిజన్ కు ఒక రిక్షాను కేటాయిస్తున్నామన్నారు. అనంతరం తీగల గుట్టపల్లిలో రూ.15లక్షలతో నిర్మించే ఎస్ డబ్ల్యూజీ డ్రైనేజీ పైపులైన్ పనులను మేయర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఈఈ కిష్టప్ప, డీఈ మసూద్ అలీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

హక్కుల సాధనకే  చైతన్య యాత్ర

జగిత్యాల, వెలుగు: మున్నూరుకాపుల హక్కుల సాధన కోసమే చైతన్య యాత్ర చేపట్టామని, యాత్ర ద్వారా వారిని చైతన్య పరుస్తామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ తెలిపారు. మంగళవారం జగిత్యాల భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ నుంచి చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మున్నూరు కాపులు 70 శాతం మంది ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారన్నారు. అనంతరం యాత్రకు సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీడర్లు రాజేందర్ , రాజ్ కుమార్, అంజయ్య పటేల్  కౌన్సలర్స్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.