రామడుగు, వెలుగు : కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ప్రజల నుంచి నిరసన తెగ తగిలింది. రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతుండగా తమ గ్రామంలో చేసిన అభివృద్ధి చూపాలంటూ యువకులు, గ్రామస్తులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల ప్రచారంలో తమ గ్రామానికి వచ్చిన రవిశంకర్.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చారని మండిపడ్డారు.
ఐదు సంవత్సరాలలో ఒక్కరోజు కూడా తమ గ్రామానికి రాని ఎమ్మెల్యే.. ఈరోజు మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చారని ధ్వజమెత్తారు. గ్రామాభివృద్ధికి ఏం చేశావని అడిగితే ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా పారిపోయారని పలువురు యువకులు ఆరోపించారు. కాగా, రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామంలో ఉదయం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రవిశంకర్ పాల్గొనగా మెజారిటీ ఓట్లున్న గౌడ కులస్థులు.. ఎమ్మెల్యే పాల్గొన్న ప్రచారంలో తాము పాల్గొనకూడదని తీర్మానం చేసుకున్నారు.