సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ బండి సంజయ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. క్షుద్ర పూజలు చేసే అలవాటు బీజేపీ నాయకులకే ఉందని విమర్శించారు. ఎంపీ అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని.. సంజయ్ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ యాగాలు, హోమాలు చేస్తుంటే అవహేళనగా మాట్లాడడం బండి సంజయ్ మూర్ఖత్వమని రవిశంకర్ అన్నారు. అమ్మవారి భక్తుడైన సంజయ్ కు యాగాలకు..క్షుద్ర పూజలకు తేడా తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ నాయకుల లాగులు తడుస్తున్నాయని విమర్శించారు. బండి సంజయ్ అబద్ధపు మాటలను మునుగోడు ప్రజలు నమ్మొద్దని కోరారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఒక రూపాయి తేలేని నువ్వు మునుగోడుకులో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావని నిలదీశారు. మునుగోడులో కూడా నాగార్జునసాగర్ లో వచ్చిన ఫలితమే రిపీట్ అవుతోందని ధీమా వ్యక్తం చేశారు.