హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ జైలు నుండి విడుదల అయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీకి తెలంగాణ హైకోర్టు 2024, అక్టోబర్ 24న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో 2024, అక్టోబర్ 25న జానీ చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అయ్యారు.
కాగా, జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పలుమార్లు జానీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం నిరాకరించింది.
ALSO READ | బ్రేకింగ్ : కొరియోగ్రాఫర్ జానీకి బెయిల్ మంజూరు
నేషనల్ అవార్డు అందుకునేందుకు మధ్యలో ఐదు రోజుల పాటు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం జానీకి అవార్డ్‌ను రద్దు చేసింది. దీంతో న్యాయస్థానం బెయిల్ రద్దు చేయగా.. తిరిగి జానీ మళ్లీ జైలుకెళ్లారు. ఈ సారి జానీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ.. ఎట్టకేలకు శుక్రవారం విడుదల అయ్యారు.