హైదరాబాద్: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ అలియాస్ జానీ భాషా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఉప్పరపల్లి కోర్టు జానీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని చంచల్ గూడ్ జైలుకు తరలించారు. అయితే, కొరియాగ్రాఫర్ జానీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ విచారణలో జానీ నేరాన్నీ అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడన్న పోలీసులు.. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు వెల్లడించారు. 2020లో ముంబైలోని ఓ హోటల్ లో కూడా జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు.. ఈ విషయాన్ని విచారణలో జానీనే ఒప్పుకున్నట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లని వెల్లడించిన పోలీసులు.. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని జానీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తనపై నమోదైన కేసుపై స్పందించిన జానీ.. ఇది అక్రమ కేసు అని.. తనను కావాలని టార్గెట్ చేశారని అన్నారు. తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న జానీ.. లీగల్‌గా ఫైట్ చేస్తానని స్పష్టం చేశారు. తనను టార్గెట్ చేసిన ఎవరిని వదలనని.. వడ్డీతో సహా చెల్లిస్తానని జానీ హెచ్చరించారు. జానీ వెర్షన్ ఇలా ఉంటే.. పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్టులో జానీ నేరం అంగీకరించాడని పేర్కొనడం సంచలనంగా మారింది. దీంతో కొరియోగ్రాఫర్ జానీ కేసుపై ఉత్కంఠ నెలకొంది.