రంగారెడ్డి: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న జానీని కోర్టు అనుమతితో పోలీసులు ఇవాళ (సెప్టెంబర్ 25) సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. 2024 సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 4.30 వరకు (మొత్తం నాలుగు రోజులు) జానీ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.
కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ నుండి కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అభ్యర్థనకు ఒకే చెప్పిన న్యాయస్థానం.. 4 రోజుల పాటు జానీని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ | జానీకి బెయిలా.. కస్డడీనా..? రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
కస్టడీలో భాగంగా జానీపై ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని.. నిందితుడి లాయర్ పర్యవేక్షణలోనే ప్రశ్నించాలని ఆదేశించింది. కస్టడీ ముగిసిన వెంటనే జానీకి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ మెడికల్ రిపోర్ట్‌ను కోర్టులో సబ్మిట్ చేయాలని సూచించింది. జానీ తిరిగి సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు కోర్టులో హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది. జానీని నాలుగు రోజుల కస్టడీకి అప్పగించడంతో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపడుతాయోననే దానిపై ఆసక్తి నెలకొంది.