హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన లీడర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలిపై అతడి సతీమణి సుమలత ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమలతను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో ఇవాళ (అక్టోబర్ 2) ఆమె ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరయ్యారు. తన భర్త జానీపై మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలను సుమలత ఖండించారు.
మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి అందించారు. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని సుమలత కోరారు. సుమలత దగ్గర వివరాలు సేకరించిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వాటిని పరిశీలిస్తున్నారు. దీంతో జానీపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ALSO READ | ఇతరుల పిల్లలు ముఖ్యం కాదా : పూనమ్ కౌర్ పోస్ట్
కాగా, తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతడి దగ్గరే పని చేసిన ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా జానీ చంచల్ గూడలో ఉన్నారు.
ఈ కేసులో మరిన్నీ విషయాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో పోలీసులు జానీని నాలుగు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న జానీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. జానీ బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జానీకి బెయిల్ వస్తుందా రాదా అని సస్పెన్స్ నెలకొంది.