USA vs ENG: క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్.. తేలిపోయిన అమెరికన్లు

USA vs ENG: క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్.. తేలిపోయిన అమెరికన్లు

అమెరికాతో జరుగుతున్న తమ ఆఖరి సూప‌ర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు అద‌ర‌గొట్టారు. పేస‌ర్ క్రిస్ జోర్డాన్(4/10) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. 19వ ఓవ‌ర్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి అమెరికన్ ఇన్నింగ్స్ త్వరగా ముగించాడు. అతనికి తోడు స్పిన్నర్ ఆదిల్ ర‌షీద్ (2/13), సామ్ కరణ్(2/23) రాణించడంతో ఆతిథ్య అమెరికా స్వల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. 18.5 ఓవర్లలో 115 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

నితీశ్ టాప్ స్కోరర్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికాకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెన‌ర్లు స్టీవెన్ టేల‌ర్(12), ఆండ్రిస్ గౌస్(8)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ త‌ర్వాత వచ్చిన నితీశ్ కుమార్(30) కాసేపు ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అలరించాడు. అతను ఔటయ్యాక అమెరికా ఇన్నింగ్స్ గాడితప్పింది. తరువాత వచ్చిన బ్యాటర్లు పరుగులు చేస్తున్నా.. వేగంగా ఆడలేకపోయారు. హ‌ర్మీత్ సింగ్(21) పర్వాలేదనిపించగా.. కొరే అండ‌ర్సన్(29; 28 బంతుల్లో) బంతికో పరుగు చొప్పున స్కోర్ చేశాడు. 19వ ఓవ‌ర్లో జోర్డాన్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో అమెరికా ఇన్నింగ్స్  త్వరగా ముగిసింది.