వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక కనీసం సూపర్-8 కు చేరలేకపోయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లపై ఓడిపోయి గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో శ్రీలంక జట్టుపై ఆ దేశంలో విమర్శల వర్షం కురుస్తుంది. వరల్డ్ కప్ ఓటమి తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ సిల్వర్ వుడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కోచ్ పదవికి రాజీనామా చేసి ఊహించని షాక్ ఇచ్చాడు.
వ్యక్తిగత కారణాల వలనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని.. కుటుంబంతో తన సమయాన్ని కేటాయించాలని ఆయన చెప్పుకొచ్చాడు. సిల్వర్‌వుడ్ ఇంగ్లండ్ మెన్స్ జట్టుకు ప్రధాన కోచ్ గా చేసిన తర్వాత ఏప్రిల్ 2022లో శ్రీలంక ప్రధాన కోచ్ గా బాధ్యతలు చెప్పట్టాడు. శ్రీలంక వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. వుడ్ కోచ్ గా శ్రీలంక 8 టెస్టులు, 26 వన్డేలు, 18 టీ20 మ్యాచ్ లు గెలిచారు.
Also Read: రషీద్ ఖాన్‌కు ఐసీసీ మందలింపు.. ఏం జరిగిందంటే..?
“అంతర్జాతీయ కోచ్‌గా ఉండటం అంటే చాలా కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇకపై నా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. నా ప్రయాణంలో నను ఆదరించిన వారికి నా కృతజ్ఞతలు. శ్రీలంక క్రికెట్‌లో భాగం కావడం నాకు నిజమైన గౌరవం". అని శ్రీలంక క్రికెట్ (SLC) విడుదల చేసిన ఒక ప్రకటనలో సిల్వర్‌వుడ్ తెలిపారు. 2014 టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచిన శ్రీలంక.. ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతుంది. ఒక్కసారి కూడా సెమీస్ కు అర్హత సాధించలేకపోయింది.