ENG vs SL 2024: స్పిన్నర్ అవతారమెత్తిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ స్పిన్ బౌలింగ్ వేసి ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో వోక్స్ తొలి రెండు బంతులను పేస్ బౌలింగ్ వేశాడు. అయితే వెలుతురు మందగించడంతో వోక్స్ ఒక్కసారిగా ఆఫ్ స్పిన్ వేస్తూ కనిపించాడు. చివరి నాలుగు బంతులను అద్భుతమైన ఆఫ్ స్పిన్ వేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. తాను స్పిన్ వేసిన నాలుగు బంతులకు ఒక ఫోర్ తో సహా 6 పరుగులు వచ్చాయి. ఇది చూసి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్.. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆశ్చర్యంగా చూస్తూ నవ్వారు.    

గతంలో ఇంగ్లాండ్ పేసర్ ఆలీ రాబిన్సన్ స్పిన్ వేశాడు. అయితే ఓవర్ మధ్యలో ఇలా స్పిన్ బౌలింగ్ వేయడం ఇదే తొలిసారి. వోక్స్ బౌలింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆఫ్ స్పిన్ అద్భుతంగా వేస్తున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ మ్యాచ్ లో ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 

కామిందు మెండీస్ (54), ధనంజయ్ డిసిల్వా క్రీజ్ లో ఉన్నారు. నిస్సంకా 64 పరుగులు చేసి రాణించాడు. అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ పోప్ (154) సెంచరీతో 325 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 3 వికెట్ల నష్టానికి 261 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి 325 పరుగులకే పరిమితమైంది.