ENG vs SL: ఆడింది చాలు.. వచ్చేయండి: ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఈసీబీ షాక్

ENG vs SL: ఆడింది చాలు.. వచ్చేయండి: ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఈసీబీ షాక్

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ది హండ్రెడ్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ చివరి మ్యాచ్ లకు అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండడం లేదు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు ముందు తమ బౌలర్ల ఫిట్‌నెస్‌పై జాగ్రత్తగా ఉండాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చూస్తోంది. ఇప్పటికే టెస్ట్ జట్టులో సెలక్ట్ అయిన క్రిస్ వోక్స్‌ను హండ్రెడ్ లీగ్ నాకౌట్‌లకు మ్యాచ్ లకు దూరమయ్యాడు. తాజాగా స్టార్ పేసర్ గుస్ అట్కిన్సన్‌ సైతం హండ్రెడ్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే ఈ టోర్నీలో గాయం కారణంగా బెన్ స్టోక్స్ దూరమైన సంగతి తెలిసిందే. 

హండ్రెడ్ లీగ్ లో ప్రస్తుతం ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అట్కిన్సన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఈ పేసర్ లేకపోవడం ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. అట్కిన్సన్‌ ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదని ఇన్విన్సిబుల్స్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ తెలిపాడు. ఇప్పటికే ఆసీస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ దూరమవ్వడంతో ఇద్దరు స్టార్ పేసర్ సేవలను ఆ జట్టు కోల్పోనుంది. అయితే ఇన్విన్సిబుల్స్ చివరి గ్రూప్ మ్యాచ్ నుండి విశ్రాంతి తీసుకున్న పేసర్ టామ్ కుర్రాన్  జట్టులోకి రావడం ఊరటనిచ్చే అంశం.

ఇటీవల ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ వోక్స్‌ హండ్రెడ్ లీగ్ నుంచి వైదొలిగాడు. అతడు ఆడుతున్న నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్‌  నాకౌట్ కు అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్లు అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు అట్కిన్సన్‌, వోక్స్‌ కీలక పేసర్లుగా మారారు. ముఖ్యంగా అట్కిన్సన్‌ ఇటీవలే వెస్టిండీస్ తో ముగిసిన సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంకతో ఇంగ్లాండ్ స్వదేశంలో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆగస్టు 21న ఓల్డ్ ట్రాఫర్డ్ లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.