Vitality T20 Blast: ఈజీ రనౌట్ ఛాన్స్.. క్రీడా స్ఫూర్తి చాటుకున్న ఇంగ్లాండ్ పేసర్

Vitality T20 Blast: ఈజీ రనౌట్ ఛాన్స్.. క్రీడా స్ఫూర్తి చాటుకున్న ఇంగ్లాండ్ పేసర్

క్రికెట్ లో క్రీడా స్ఫూర్తి ప్రదర్శించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అలాంటి ఆటగాళ్లను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. అప్పటివరకు వికెట్ కోసం ఎదరు చూసే జట్టు.. ఔట్ చేసే ఏ చిన్న అవకాశాన్ని అసలు వదులుకోవాలనుకోదు. ప్రత్యర్థి బ్యాటర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరికి సంబంధం లేదు. అయితే హాంప్‌షైర్ తరపున ఆడుతున్న క్రిస్ వుడ్ తన క్రీడా స్ఫూర్తి చాటుకున్నాడు. 

వైటాలిటీ T20 బ్లాస్ట్ లో భాగంగా ఆదివారం (జూన్ 2) కెంట్, హాంప్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చింది. కెంట్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో వుడ్ వేసిన ఫుల్-టాస్ బంతిని జోయి ఎవిసన్‌ మిడాఫ్ దిశగా ఆడాడు. అయితే ఈ బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మాట్ పార్కిన్‌సన్‌ కు బలంగా తగిలింది. అప్పటికే క్రీజ్ ధాటి సగం దూరం వెళ్లిన పార్కిన్‌సన్‌ బంతి తగలడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. 

పార్కిన్‌సన్‌ పరిస్థితి చూసి క్రిస్ వుడ్ రనౌట్ చేసే అవకాశం ఉన్నా.. అతని బౌలింగ్ మార్క్‌కి తిరిగి వచ్చాడు. వుడ్  ప్రదర్శించిన ఈ క్రీడా స్ఫూర్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే  కెంట్‌పై హాంప్‌షైర్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షైర్ మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది.