కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం అర్దరాత్రి నుంచే క్రిస్టియన్లు వేడుకలు ప్రారంభించారు. మానేర్ డ్యాం శివారులోని బ్లెసింగ్ గాస్పెల్ మిసిస్ట్రీస్ చర్చిని మినిస్టర్గంగుల కమలాకర్.. ఎమ్మెల్యే బాలకిషన్, మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని చర్చిలో ఎమ్మెల్యే చందర్ దుస్తులు పంపిణీ చేశారు. రామగుండంలోని తబితా ఆశ్రమంలో ‘స్మితం హితం’, కేఎస్‌ఆర్ సంస్థ, ‘ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ’ ప్రతినిధులు కందుల సంధ్యారాణి, దినేశ్, కుమార్ ఆధ్వర్యంలో బట్టలు, పండ్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. సింగరేణి స్టేడియంలో జిమ్మిబాబు ఆధ్వర్యంలో వాకర్స్ సంబరాలు చేశారు. జమ్మికుంట సీఎస్ఐ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్రాజేశ్వర్ రావు క్రిస్టియన్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుల్తానాబాద్ లోని నీరుకుల్ల రోడ్డులో ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా వేడుకలు జరిపారు. మెట్ పల్లి లోని క్రైస్ట్ చర్జి, బేతేలు, బేతనియ, మండుచున్న అగ్ని, ఏసు రక్తం, కృప మినిస్ట్రీస్, సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగిత్యాలలోని గోవింద్ పల్లి ఏసురక్తం గార్డెన్స్ చర్చిలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రార్థనలు చేశారు. వేములవాడలోని తిప్పాపురం ఫెయిత్ బాప్టిస్ట్ చర్చిలో, నాంపల్లిలో వేడుకలు జరిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి పాల్గొన్నారు. హుజూరాబాద్ రాంపూర్ రంగాపూర్ లోని కల్వరి టెంపుల్ లో ఎమ్మెల్యే రాజేందర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.–వెలుగు, నెట్వర్క్
ఉచిత కంటి ఆపరేషన్లు
గోదావరిఖని, వెలుగు : రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి దవాఖానాకు తరలించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ పి.మల్లికార్జున్, సీనియర్ సభ్యులు గంగాధర్, డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి మంగళ, గురు, శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజన్ సెంటర్ ద్వారా ఉచిత కంటి నిర్వహిస్తారని తెలిపారు. వారంలో మూడు రోజులు ఉచిత షుగర్ పరీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
‘కార్మికులను మభ్యపెట్టేందుకే బీఆర్‌ఎస్ దీక్ష’
గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికులను మభ్య పెట్టేందుకే బీఆర్‌ఎస్ సింగరేణి పోరు దీక్ష పేరుతో నాటకాలాడుతోందని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హాయాంలో జరిగిన తప్పును సుప్రీంకోర్టు సరిదిద్దగా, ఆ తీర్పు ప్రకారమే కోల్ బ్లాక్‌ల కేటాయింపు జరుగుతుంటే ప్రైవేటీకరణ అంటూ దొంగ దీక్షలు చేస్తుండడాన్ని కార్మికులు గమనించాలని కోరారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర వాటా ఉన్నప్పుడు తామేలా సంస్థను ప్రైవేటుపరం చేస్తామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అజాత శత్రువు వాజ్‌పేయి
భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్ పేయి 98వ జయంతిని ఆదివారం ఉమ్మడి కరీంనగర్నగర్లోని జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో బీజేపీ లీడర్లు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల, కోరుట్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సత్యనారాయణ రావు, బీజేపీ కౌన్సిలర్ నరేశ్ఆధ్వర్యంలో వాజ్‌పేయి ఫొటోకు నివాళులర్పించి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు. కథలాపూర్ మండలంలోని సిరికొండలో జగిత్యాల కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, జమ్మికుంట పట్టణంలో లీడర్లు రాకేశ్, శక్తి కేంద్రం ఇన్చార్జి స్వరూప ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మంథనిలో బీజేపీ పట్టణాధ్యక్షుడు ఎడ్ల సదాశివ్ వాజ్ పేయ్ జయంతి నిర్వహించారు. మెట్ పల్లిలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో, ఇల్లందకుంటలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. హుజూరాబాద్‌లో బీజేపీ జిల్లాధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణాధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో, ధర్మారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండలాధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో, కోనరావుపేటలో బీజేవైఎం మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, లీడర్లు వాజ్‌పేయి ఫొటోకు నివాళులర్పించారు.–వెలుగు, నెట్వర్క్
నేడే సెస్ ఎన్నికల కౌంటింగ్
- ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
వేములవాడ, వెలుగు : సిరిసిల్ల విద్యుత్ సహకారం సంఘం ఎన్నికల కౌంటింగ్సోమవారం జరుగనుంది. ఇంకొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తెలవనుంది. మొత్తం 87,130 సెస్ ఓటర్లు ఉండగా 77,189 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేములవాడ పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సెస్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందని, క్యాండెంట్, లేదా ఏజెంట్ ను కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 11 స్థానాలకు రెండు టెబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని, మిగతా నాలుగు డైరక్టర్ల స్థానాలకు ఒక్కొక్క టెబుల్ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్ కౌంటింగ్ ఇన్చార్జితో మరో ఇద్దరు.. మొత్తం 76 మంది సిబ్బంది ఉంటారని, ఒక్కో డైరెక్టర్ స్థానానికి ఒక్కో గది చొప్పున 15 గదులలో ఓట్లు లెక్కిస్తారని ఎన్నికల అధికారి మమత తెలిపారు.
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఆరట్టు
జమ్మికుంట, వెలుగు : స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం అయ్యప్ప స్వామి ఊరేగింపు(రథయాత్ర) పంబ ఆరట్టు నిర్వహించారు. మండల పూజ ముగింపు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు జయందేవ్గురుస్వామి శాలువా కప్పి ఆయనను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్రాజేశ్వర్ రావు హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. గుమ్మడి కాయలు కొట్టి స్వామి రథయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని మహిళలు స్వామి వారికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయ కోనేరులో గురుస్వాములు స్వామివారి ఉత్సవ విగ్రహాల చక్రతీర్థం(పంబ ఆరట్టు) నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు దేశిని కోటి, రమేశ్, మనోహర్ గురుస్వాములు పాల్గొన్నారు.