- 13 జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు
- కిటకిటలాడిన మెదక్ చర్చి
మెదక్, వెలుగు : చర్ఛ్ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ), మహిళా మైత్రి సంఘం 78వ ఆవిర్భావ వేడుకలు మెదక్ పట్టణంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా మైత్రి సంఘాల సభ్యులు, క్రైస్తవులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, డ్యాన్సులు, కోలాటాలు, చెక్క భజనలు, క్రీస్తు స్తుతి గీతాల ఆలాపనలతో ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. బిషప్రైట్రెవరెండ్ రుబిన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని ఇచ్చారు.
ఆయా జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు మహా దేవాలయంగా పేరుగాంచిన చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కులు చెల్లించుకుని, గురువుల ఆశీర్వాదాలు అందుకున్నారు. వేలాది గా తరలి వచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. ఈ సందర్భంగా మిషన్ హాస్పిటల్‌ను మళ్లీ ప్రారంభించారు. బిషప్ భార్య ప్రిసిల్ల ప్రమీల, చర్చి కమిటీ బాధ్యులు విమల్ సుకుమార్, సాల్మన్‌రాజ్, విల్సన్, జయానంద్, డానియల్ పాల్గొన్నారు.
అందరూ బాగుండాలి : ఎమ్మెల్యే
దేవుడి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే రోహిత్ రావుఆకాంక్షించారు. మెదక్ చర్చిలో జరిగిన సీఎస్ఐ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గురువుల దీవెనలు అందుకున్నారు. ప్రజలు శాంతి సామరస్యంతో మెలగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ లింగం, షమీ, కాంగ్రెస్ నాయకులు ముత్యం గౌడ్, ప్రవీణ్ గౌడ్, పవన్, అశోక్, శ్రీనివాస్ చౌదరి, శంకర్, బానీ, గంగాధర్, సంగమేశ్వర్, సంపత్ పాల్గొన్నారు.